పాక్ డ్రోన్లపై అప్రమత్తం- ఎల్ఓసీ వెంబడి హైఅలర్ట్ చైనా డ్రోన్లను వినియోగించి పంజాబ్లోపాకిస్థాన్ ఆయుధాలను జారవిడిచిన ఘటనను భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తీవ్రంగా పరిగణించాయి. ఈ నేపథ్యంలో భారత్- పాక్ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి రెడ్ అలర్ట్ ప్రకటించాయి. నిత్యం అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలను ఆదేశించాయి.
పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు(10కేజీల సామాగ్రి మోయగలిగే సామర్థ్యం) పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లాలో 7-8 సార్లు వచ్చి ఆయుధాలు, నకిలీ నోట్లను జారవిడిచాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
అంతర్జాతీయ సరిహద్దు, జమ్ము, సాంబ, కథువా, రాజౌరీ, పూంచ్, బారాముల్లా, కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సాధ్యమైనంత ఎక్కువ నిఘాను ఏర్పాటు చేయాలని దళాలకు సైన్యం, బీఎస్ఎఫ్ తెలిపాయి.
" ఇది దేశంలో ఉగ్ర చర్యలు చేపట్టడం కోసం ఆయుధాలు, పేలుడు సామాగ్రిని అక్రమంగా తరలించడానికి పాక్ పన్నిన కుట్ర. భద్రతను కట్టుదిట్టం చేశాం. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిఘా పెంచాలని దళాలకు ఆదేశాలు జారీ చేశాం."
-- బీఎస్ఎఫ్ అధికారి.
పాకిస్థాన్‌తో భారత్ పంచుకునే అంతర్జాతీయ సరిహద్దులో సుమారు 180 కిలోమీటర్లలో బీఎస్ఎఫ్ దళాలు గస్తీ కాస్తాయి. భారత గగనతలంలోకి అక్రమంగా చొరబడే ఎలాంటి డ్రోన్లనైనా నేలమట్టం చేయాలని భద్రతా దళాలకు ఆదేశాలు అందాయి.