భారత్-చైనా సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ వ్యవహరించిన విధానంపై కీలక సమాచారం బయటకు వచ్చింది. సరిహద్దుల్లో పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సైన్యం ఎప్పటికప్పుడు సమాచారం అందించిందని తెలుస్తోంది. లద్దాక్ వద్ద.. చైనా బలగాలను మోహరించిన అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారని భారత ఆర్మీ అధికారులు అనధికారికంగా వెల్లడించారు.
కేబినెట్ సహచరులతో చర్చలు..
మే 4న సరిహద్దు వెంట తమ బలగాలను చైనా మోహరించిన అనంతరం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర సీనియర్ మంత్రులు, ఆర్మీ అధికారులతో ప్రధాని చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 'సరిహద్దు వద్ద పొరుగుదేశం జోక్యం ఎక్కువైంద'నే అంశమై మేథోమదనం జరిగిందని పేర్కొన్నాయి.
మెక్‌మోహన్ రేఖ వెంట గల్వాన్ లోయవద్ద 14వ పాట్రోలింగ్ పాయింట్ సహా ఇతర ప్రాంతాలకు సమీపంలో చైనా బలగాల కార్యకలాపాల గురించి ప్రధానికి నివేదించినట్లు ఆర్మీ అధికారులు అనధికారికంగా వెల్లడించారు. 14 కోర్ ప్రధాన కేంద్రం నుంచి భారత సైన్యం.. చైనా కార్యకలాపాలను పర్యవేక్షించిందని.. నాటి నుంచే వారికి బదులు చెప్పేందుకు సిద్ధమయినట్లు తెలిపారు.