తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనాపై పోరులో ఓర్పు, క్రమశిక్షణే కీలకం'

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్న వేళ.. కీలక సూచనలు చేశారు త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​. కొవిడ్​ కట్టడికి ప్రజలంతా కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉండాలన్న ఆయన.. ఓర్పు, క్రమశిక్షణ కీలకమని వ్యాఖ్యానించారు. ఒక బలీయమైన ప్రాంతీయ శక్తిగా ఎదుగుతున్న భారత్​.. ఇతరులకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. తమకెలాంటి కార్యం అప్పజెప్పినా.. స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

By

Published : Apr 26, 2020, 10:24 AM IST

armed-forces-must-remain-safe-from-virus
'కరోనాపై పోరులో ఓర్పు, క్రమశిక్షణే కీలకం'

కరోనా వైరస్​పై పోరులో సాయుధ దళాలుగా తమ బాధ్యతను అర్థం చేసుకున్నామని వ్యాఖ్యానించారు రక్షణ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​. తామంతా సురక్షితంగా ఉండాలన్న ఆయన.. సైనిక, నావికా, వాయుసేన సిబ్బంది కరోనా బారినపడితే దేశప్రజలకు, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేదెవరు అని ఏఎన్​ఐ ముఖాముఖిలో ప్రశ్నించారు.

'' దేశ ప్రజలకు, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన క్రమంలోనే మేం కఠిన నిబంధనలను అమలు చేశాం. భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి అందులో భాగమే. క్వారంటైన్​లో ఉన్నవారు.. వ్యాప్తి తగ్గే వరకు నిర్బంధంలోనే ఉండాలి.''

- జనరల్​ బిపిన్​ రావత్​, త్రివిధ దళాధిపతి

ఓర్పుతోనే క్రమశిక్షణ సాధ్యం...

కొవిడ్​-19పై విజయం సాధించాలంటే కొన్ని ఆదేశాలు తప్పక పాటించాలని, అందులో క్రమశిక్షణ, ఓర్పు ఎంతో కీలకమని స్పష్టం చేశారు రావత్. ఓర్పుతోనే క్రమశిక్షణ అలవడుతుందని... అప్పుడే వైరస్​ నివారణ సాధ్యమవుతుందని విశ్లేషించారు. కొవిడ్​ వైరస్​.... త్రివిధ దళాలను పరిమితంగా ప్రభావితం చేసిందని తెలిపారు రావత్​. కరోనా నివారణలో ఇవే తమకు ఎంతో మేలు చేశాయని అన్నారు.

మేకిన్​ ఇండియా బలోపేతం..

మేకిన్​ ఇండియాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న రావత్.. భవిష్యత్తులో ఆయుధాల దిగుమతి క్రమంగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'' కొవిడ్​-19 వైరస్​ మనకు ఒక పాఠం నేర్పింది. స్వావలంబన(ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించే) సమయం ఆసన్నమైంది. భారత్​.. ఒక ప్రాంతీయ శక్తిగా అవతరించాలని చూస్తున్న సమయంలో ఇతరులకు మద్దతుగా ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే ఒకరి మద్దతుపై ఆధారపడకూడదు. మేకిన్​ ఇండియాను ప్రోత్సహించడం ముఖ్యం.

రక్షణ రంగంలో ఉన్న మేం... ఆయుధాలు, ముడి పరికరాలు, మందుగుండు సామగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే.. ఇక్కడి పరిశ్రమలు, అభివృద్ధి చెందిన సంస్థలపై నమ్మకం ఉంచితే మన సొంత పరిజ్ఞానం, మన దేశంలోనే మందుగుండు, ఆయుధాల తయారీ ప్రారంభించవచ్చు.''

- బిపిన్​ రావత్​, త్రివిధ దళాధిపతి

రక్షణ బడ్జెట్​పై..

రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్​ను వృథా ఖర్చులు చేయకుండా.. అవసరాలకు అనుగుణంగా ఆచరణాత్మకంగా వినియోగించుకుంటామని తెలిపారు రావత్​. తమకెలాంటి కార్యం అప్పగించినా... స్వీకరించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు సమాధానమిచ్చారు.

ఆరోగ్య సేతు యాప్​పై..

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సేతు యాప్​ను ప్రజలు భారీసంఖ్యలో డౌన్​లోడ్ చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఒకవేళ ఎవరైనా​ కరోనా బారినపడితే... ఈ యాప్​ ద్వారా వెంటనే స్పందించి వీలైనంత త్వరగా చికిత్స అందించవచ్చన్నారు. వ్యాప్తికీ అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details