వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైన్యంతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర అవసరాలు తీర్చే విధంగా రూ. 300 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోళ్లు చేపట్టేందుకు త్రివిధ దళాలకు అధికారం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పరిమితి మేరకు ఇకపై కొనుగోళ్లకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెలుస్తోంది!
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రూ.300 కోట్ల వరకు ఎన్నైనా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని తెలిపింది. ఆయుధాల కొనుగోళ్లకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. ఉత్తర సరిహద్దులో తాజా పరిస్థితుల నేపథ్యంలో సాయుధ దళాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని డీఏసీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపింది.
'అత్యవసర పనుల నిమిత్తం ఆయుధాలు కొనుగోలు చేసే అధికారాన్ని సైన్యానికి డీఏసీ బదిలీ చేసింది. పెట్టుబడి కోసం రూ.300 కోట్లు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఆయుధాల దిగుమతి కాలం ఏడాది కంటే తగ్గుతుంది' అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.