మహారాష్ట్ర రాజకీయ అంకగణితం(అరిథమాటిక్) లెక్కలు సరితూగనందు వల్లే అధిక సీట్లు గెల్చుకున్న భాజపా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని చెప్పారు ఆ రాష్ట్ర మాజీ సీఎం, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్. అందుకే ఎన్నికల్లో కేవలం 40 శాతం మార్కులు సాధించిన వారు అధికారం చేపట్టారని.. 70శాతం మార్కులు సాధించిన తాము ప్రతిపక్షంలో ఉన్నామన్నారు.
మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఫడణవీస్ ఎన్నికైనందుకు అభినందనలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఈ సందర్భంగా సభలో మాట్లాడారు ఫడణవీస్. తాను రెండోసారి సీఎం అవుతానని గతంలో చేసిన వ్యాఖ్యలను అంగీకరించారు. అయితే నిర్దిష్ట సమయం ఏదో చెప్పలేదన్నారు. సీఎం పదవిని తిరిగి చేపట్టడానికి మరికొంత కాలం వేచి చూడాలన్నారు.
అక్టోబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 70శాతం స్ట్రయిక్ రేట్ నమోదు చేసిందని మరోసారి గుర్తు చేశారు ఫడణవీస్. తక్కువ సీట్లు వచ్చిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమేనని తాము అంగీకరిస్తున్నట్లు తెలిపారు.