కర్ణాటక శివమొగ్గ దక్షిణ పశ్చిమ రైల్వేకు చెందిన.. అరసలు రైల్వే స్టేషన్ రూపురేఖలే మారిపోయాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం... 'మాల్గుడి డేస్' రూపుదిద్దుకున్న ఆ స్టేషన్ ఇప్పుడు మళ్లీ.. అదే కళను సంతరించుకుంది.
మాల్గుడి రోజులే వేరు..
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు నవీకరణవైపు తొలి అడుగులు వేస్తున్న రోజులవి. ఆ నాటి పల్లె పరిస్థితులు.. పచ్చని పైర్లు.. కలుషితం కాని భాష.. ఆధునికం అమాయక ప్రజానికానికి మధ్య మగ్గిన ఓ గీతను అద్భుతంగా వర్ణించిన 'మాల్గుడి డేస్' పుస్తకాన్ని ఆర్.కే నారాయణ్ స్వాతంత్య్రానికి ముందే రచించారు. అయితే 1987 ప్రాంతంలో ఆ పుస్తకాన్ని టీవీ సీరియల్‌గా చిత్రీకరించి.. అనేక భాషల ప్రేక్షకుల హృదయాన్ని కదిలించేలా చేశారు దర్శకేంద్రుడు శంకర్ నాగ్.
అప్పుడే అడపాదడపా టీవీలు దర్శనిస్తున్న ఆ కాలంలో.. టీవీ ఉన్న చోటికే పిల్లా,పెద్దా చేరి దాదాపు 2006 వరకు 'మాల్గుడి డేస్'ను కళ్లార్పకుండా చూశారు. మాల్గుడి డేస్ మాధుర్యాన్ని చూసినవారెవరూ... ఆ దృశ్యాలను అంత తేలిగ్గా మరిచిపోలేరు. సీరియల్ మొదలయ్యే సమయానికి మోగే ఓ జానపద సంగీతం ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలను మీటుతూనే ఉంది. అందుకే, ఈ తరానికీ ఆ రోజులు కళ్లకు కట్టేలా అరసల రైల్వే స్టేషన్‌ను మార్చేశారు అధికారులు.