తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వెనక్కి తగ్గేది లేదు- చెరిసగంపై హామీ ఇస్తేనే చర్చలు' - sanjay raut latest news

మహారాష్ట్రలో రాజకీయ స్తబ్ధత కొనసాగుతూనే ఉంది. శివసేన తన డిమాండ్లపై వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. లిఖిత పూర్వక హామీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని సేన నేత సంజయ్​ రౌత్ స్పష్టం చేశారు. మరోవైపు నిశితంగా పరిస్థితులను పరిశీలిస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీలు.. భాజపాపై ఎదురుదాడి చేస్తున్నాయి.

సంజయ్ రౌత్, శివసేన నేత

By

Published : Nov 8, 2019, 1:05 PM IST

శివసేనతో భాజపా సంప్రదింపులు జరపాలంటే ముందుగా అధికారాన్ని పంచేందుకు అంగీకరించాలని ఆ పార్టీ నేత సంజయ్​ రౌత్​ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు రౌత్. లిఖిత పూర్వక హామీతో వస్తేనే మాట్లాడతామని తేల్చిచెప్పారు.

ముంబయిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. నవంబర్​ 9తో ప్రభుత్వ గడువు ముగుస్తున్న నేపథ్యంలో సీఎం రాజీనామా చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆపద్ధర్మ ప్రభుత్వ ధర్మాన్ని దుర్వినియోగం చేయొద్దన్నారు.

సంజయ్ రౌత్, శివసేన నేత

"నితిన్ గడ్కరీ ముంబయి నివాసి. ఆయన తన ఇంటికి వస్తే వార్త ఎలా అవుతుంది. మాతోశ్రీ (ఠాక్రే నివాసం)కి ఆయన వస్తారనే వార్త నిజమైతే.. శివసేనకు 2.5 ఏళ్ల అధికారం ఇస్తారనే సమాచారం మీవద్ద ఉంటే చెప్పండి. నేను ఉద్ధవ్​ ఠాక్రేతో మాట్లాడతాను.

మరో విషయం... సీఎం రాజీనామా చేయాల్సి ఉంది. అది ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా ఈ రోజు రాజీనామా చేయాల్సిందే. రేపటితో ప్రస్తుత ప్రభుత్వ గడువు పూర్తి కాబోతుంది."

-సంజయ్ రౌత్, శివసేన నేత

ఎన్సీపీ ఆరోపణలు..

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతులమీదగా పాలించాలని ప్రయత్నిస్తున్నట్లు విమర్శించింది. దిల్లీ పీఠానికి రాష్ట్ర ప్రజలు తలవంచరని ఉద్ఘాటించింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ..

ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా-శివసేన ఎటూ తేల్చుకోలేకపోతున్న సమయంలో కాంగ్రెస్ అప్రమత్తమయింది. కొత్తగా ఎన్నికైన 44 మంది ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్​ థోరట్​ సమావేశమయ్యారు.

కొనుగోలు రాజకీయాలకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానాలతో ఎమ్మెల్యేలను జైపుర్​ పంపించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ విషయంపై కాంగ్రెస్ నేత విజయ్ వాదెట్టివార్​.. పలు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ఫిరాయింపుల కోసం రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లు భాజపా నేతలు ఆశ జూపిస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి ఫోన్​ కాల్స్​ను రికార్డు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించినట్లు విజయ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details