ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పశుదాణా కుంభకోణం కేసులో బెయిల్ మంజూరు చేయాలన్న లాలూ అభ్యర్థనను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో 14ఏళ్ల జైలుశిక్షకు గాను రెండేళ్ల కారాగారం పూర్తి చేసినందుకు బెయిల్ ఇవ్వాలన్న లాలూ వాదనలను తోసిపుచ్చింది సుప్రీం. 14 ఏళ్ల శిక్షకు రెండేళ్లు ఏమాత్రం సరితూగదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
లాలూ గత 8 నెలలుగా ఆసుపత్రిలోనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేందుకే చికిత్స పొందుతున్న లాలూ.. పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నట్లు చెబుతున్నారని సీబీఐ వాదించింది. ఆసుపత్రిలో లాలూను కొన్ని పార్టీల ముఖ్య నేతలు కలిసినట్లు కోర్టుకు తెలిపింది.