తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా పెల్లుబికిన 'పౌర'ఆగ్రహం.. పోలీసుల లాఠీఛార్జి

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు.. ఉత్తర్​ప్రదేశ్​ సహా దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక, కేరళను కుదిపేస్తున్నాయి. మంగళూరు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. యూపీలో పలుచోట్ల ఆందోళనకారులు, పోలీసులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

By

Published : Dec 20, 2019, 5:59 PM IST

Updated : Dec 20, 2019, 10:53 PM IST

citizenship
దేశవ్యాప్తంగా పెల్లుబికిన 'పౌర'ఆగ్రహం.. పోలీసుల లాఠీఛార్జి

దేశవ్యాప్తంగా పెల్లుబికిన 'పౌర'ఆగ్రహం.. పోలీసుల లాఠీఛార్జి

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో పౌరసత్వ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, నిరసనకారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఆందోళనలను అణిచేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.

యూపీలో అంతర్జాలం బంద్

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూ, బులంద్​షహర్ సహా పలు ప్రాంతాల్లో మొబైల్ అంతర్జాల సేవలు, ఎస్​ఎంఎస్ సర్వీసులను అధికారులు నిలిపేశారు. అలీగఢ్​ విశ్వవిద్యాలయంలో పౌరచట్టానికి వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబికిన అనంతరం తొలిసారి మసీదులో ప్రార్థనలు జరిగిన నేపథ్యంలో నిరసనలు చెలరేగకుండా మందస్తు చర్యలు చేపట్టారు. అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో వరుసగా ఐదోరోజు అంతర్జాల సేవలను నిలిపేశారు. ఫిరోజాబాద్, గోరఖ్​పుర్, బదోయి, బహ్రాయిక్, సంబల్​ ప్రాంతాల్లో పోలీసులు లక్ష్యంగా రాళ్లు రువ్వారు.

రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ పలు ప్రాంతాలను పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించారు. అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

కాల్పులతో కర్ణాటక అప్రమత్తం

మంగళూరులో ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో గురువారం ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నారు అధికారులు. మంగళూరులో హై అలర్ట్​ ప్రకటించారు. గతరాత్రి అంతర్జాల సేవలను నిలిపేసిన అధికారులు డిసెంబర్ 22 వరకు కొనసాగిస్తామని వెల్లడించారు.

సరైన గుర్తింపు పత్రాలు లేకుండా కేరళ నుంచి మంగళూరు చేరుకున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేరళ నుంచి కర్ణాటకలో ప్రవేశించే తలప్పాడి సరిహద్దు వద్ద పూర్తిగా పరిశీలించాకే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. స్వార్థ రాజకీయ శక్తుల నుంచి ప్రజలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి యడియూరప్ప.

కేరళలో కట్టుదిట్టమైన భద్రత

కేరళ రాష్ట్రానికి సరిహద్దులో ఉండే కర్ణాటక పట్టణం మంగళూరులో ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసులు చేసిన కాల్పుల్లో ఇద్దరు మరణించిన నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వయనాడ్, కోజికోడ్, కాసర్​గోడ్, కన్నూర్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ లోక్​నాథ్ బెహరా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కేరళ నుంచి మంగళూరుకు బస్సు సర్వీసులను నిలిపేశారు.

మధ్యప్రదేశ్​లో..

మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో పోలీసులు, నిరసనకారుల మధ్య బాహాబాహి జరిగింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు పోలీసులు.

మహారాష్ట్రలో హింసాత్మకంగా నిరసనలు

పౌరచట్టానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో చేపట్టిన ఆందోళనలు హింసాయుతంగా మారాయి. బీడ్, నాందెడ్, పర్బణీ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు లక్ష్యంగా రాళ్లు విసిరారు నిరసనకారులు. ఈ నేపథ్యంలో కొంతసమయం పాటు బస్సు సర్వీసులను నిలిపేశారు అధికారులు.

ఈశాన్యంలో ప్రశాంతం

పౌరసవరణపై తాజాగా చెదురుమదురు ఘటనలు మినహా ఈశాన్య రాష్ట్రాలు ప్రశాంతంగా ఉన్నాయి. అసోంలో అంతర్జాల సేవలను పునరుద్ధరించారు. పౌరచట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న నేతలతో చర్చలు జరుపుతామని వెల్లడించారు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్.

శాంతియుతంగా బంగాల్

బంగాల్​లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేపట్టారు.

ఇదీ చూడండి: 'నిర్భయ'కు సత్వర న్యాయం కోసం హజారే మౌనవ్రతం

Last Updated : Dec 20, 2019, 10:53 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details