పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 11కి చేరింది. మేరఠ్ జిల్లాలో జరిగిన అల్లర్లలో నలుగురు మృతి చెందారు. వారణాసిలో పోలీసులు, ఆందోళనకారుల ఘర్షణల నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
ప్రార్థనల అనంతరం చెలరేగిన హింస..
గోరఖ్‌పూర్, సంభాల్, భదోహి, బహ్రయిచ్, బులంద్‌శహర్, ఫిరోజాబాద్ సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలకు నిప్పంటించారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రబ్బరు తూటాలతో కాల్పులు జరిపారు. బిజ్నోర్, మేరఠ్, సంభాల్, ఫిరోజాబాద్, కాన్పూర్‌లో ఆరుగురు మరణించారు. ఆందోళనకారుల దాడిలో 50 మందికిపైగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు పోలీసులకు తూటాలు తగిలాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.