కరోనా దెబ్బకు కుంగుతున్న సమాజంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి ప్రయత్నం జరుగుతోంది. దేశంలో లాక్‌డౌన్‌లను సడలిస్తూ ప్రజా రవాణాను అనుమతిస్తున్నారు. అంటే వైరస్ వ్యాప్తికి మరింత అవకాశం ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? కేసుల నమోదు తీవ్రత ఎలా ఉంటుంది? వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటి? మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుంది? అనే సందేహాలను దేశంలోని సీనియర్ వైరాలజిస్టుల్లో ఒకరైన డాక్టర్ టి.జాకబ్ జాన్ నివృత్తి చేశారు. రాబోయే రెండున్నర నెలలు అత్యంత కీలకమని ఆయన చెప్పారు. ఈ మేరకు 'ఈటీవీ-భారత్'తో ఆయన మాట్లాడారు.
దేశంలో ఆర్థిక రంగాన్ని మళ్లీ పట్టాలెక్కించడానికి లాక్‌డౌన్‌ను నెమ్మదిగా సడలిస్తున్నారు. ఇలాంటి సమయంలో వైరస్ వ్యాప్తి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటే మేలు?
ప్రస్తుత పరిస్థితిని రెండు దశలుగా చూడాలి. మొదటిది... లాక్‌డౌన్ ఉన్నా కరోనా మహమ్మారి మార్చి 25 నుంచి ఏప్రిల్ 15 వరకు అంటే 20 రోజుల్లో దాదాపు 20 రెట్లు పెరిగింది. ఒకవైపు ఆర్థికరంగం పూర్తిగా కుదేలవుతుంటే... మరోవైపు వైరస్ వ్యాప్తి అంచనాలకు భిన్నంగా పెరిగింది. ఈ సమయంలోనే వ్యాధిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సింది. వైరస్ విస్తరిస్తున్నప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరని అందరికీ సులభంగా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి ఉంటే... ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లి ఉండేవాళ్లం.
రెండో దశలో ప్రజల మధ్య భౌతిక దూరం నిబంధనను 6-8 అడుగుల నుంచి 2-3 అడుగులకు సడలించేవాళ్లం. ఏప్రిల్ 15 నుంచే ఆర్థిక, సామాజిక, వైద్య, విద్య, రవాణా, పారిశ్రామిక తదితర రంగాలన్నీ తెరవాల్సి ఉండింది. అదే సమయంలో వృద్ధులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని ఇళ్లకే పరిమితం చేస్తే సరిపోయేది. రెండో దశ లాక్‌డౌన్ పొడిగించినప్పుడు నేను వ్యక్తిగతంగా అసంతృప్తికి గురయ్యా. మూడోసారి పొడిగింపుతో మరింత ఆందోళన చెందాను.
కరోనా వ్యాప్తికి, అధిక ఉష్ణోగ్రతల మధ్య ఏమైనా సంబంధముందా? వేడి వాతావరణం వైరస్‌ను అడ్డుకుంటుందా?
బయట వాతావరణం ఎలా ఉన్నా... శరీర ఉష్ణోగ్రత మాత్రం 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ వైరస్ తుంపర్ల ద్వారా విస్తరిస్తూ... శ్వాస ద్వారా సోకుతుంది. వాతావరణంలో వేడి పెరిగితే వస్తువుల ఉపరితలాల నుంచి సోకే ప్రమాదం కొంతమేరకు తగ్గవచ్చు. అయితే... వాతావరణం చల్లబడిన తర్వాత మళ్లీ విస్తరిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
మరణాల రేటు భారత్‌లో తక్కువగా ఉంది. ఐరోపావాసులు, అమెరికన్లతో పోలిసే భారతీయుల్లో అధిక రోగ నిరోధక శక్తి ఉండటమే ఇందుకు కారణమా?
మరణాల శాతం జనాభాలోని వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధుల బాధితులపై ఆధారపడి ఉంటుంది. భారత్‌తో పోలిస్తే అమెరికాలో వారి సంఖ్య అధికం. దానితో అక్కడ అధికంగా ఇక్కడ తక్కువగా చనిపోతారు.
అల్లం, వెల్లుల్లి, మిరియాల తదితరాలతో కూడిన భారతీయుల సంప్రదాయ ఆహారం వైరస్‌తో పోరాటంలో కలిసి వస్తోందా?