తమిళనాడు పోలీసుల తీరుతో మరో ప్రాణం గాలిలో కలిసిపోయింది. ట్యూటికోరిన్లో తండ్రి, కొడుకుల లాకప్‌డెత్‌ను మరువకముందే టెంకాసీ జిల్లాలో మరో ఫ్లాయిడ్ తరహా దాడి జరిగింది. ఓ భూ వివాదంపై ఆటోడ్రైవర్‌ను రిమాండ్ చేసి తీవ్రంగా కొట్టారు తిరునల్వేలి పోలీసులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ జరిగింది..
టెంకాసీ జిల్లా తిరునల్వేలీకి చెందిన ఆటోడ్రైవర్ కుమారేశన్‌కు సెంథిల్ అనే వ్యక్తికి మధ్య భూవివాదం ఉంది. సెంథిల్ ఫిర్యాదుపై మే 8న కుమారేశన్‌ను విచారణకు పిలిచారు పోలీసులు. ఆ సమయంలో చెంపదెబ్బ కొట్టి.. మందలించి పంపించేశారు. అయితే కొన్ని రోజుల అనంతరం బాధితుడిని మరోసారి విచారణకు పిలిపించి తీవ్రంగా కొట్టారు. బూటుకాళ్లతో కడుపులో తన్నినట్లు సమాచారం. కొట్టినట్లు బయటకు చెబితే.. తీవ్ర చర్యలు తప్పవని నాడు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
పోలీసుల దెబ్బలతో తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు కుమారేశన్. జూన్ 12న ఆస్పత్రిలో చేరాడు. చికిత్స సందర్భంగా పోలీసులు కొట్టిన విషయాన్ని వైద్యులకు వెల్లడించాడు కుమారేశన్. పరీక్షలు చేసిన వైద్యులు అతనికి కిడ్నీలు, కాలేయం దెబ్బతిన్నట్లు నిర్ధరించారు. 15 రోజుల పాటు చికిత్స చేసినప్పటికీ.. అవయవాలు విఫలమై శనివారం ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు కారణమైన పోలీసులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఇదీ చూడండి:'అక్కడ జార్జి ఫ్లాయిడ్.. ఇక్కడ జయరాజ్-ఫెనిక్స్'