విదేశీ యువతుల అక్రమ రవాణా, వ్యభిచారం కేసులో ఎన్‌ఐఏ మరొకరిని అరెస్టు చేసింది. సలాం భార్య బంగ్లాదేశ్ జాతీయురాలు శివులి ఖటూన్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఖటూన్ 2012లో దేశంలోకి అక్రమంగా చొరబడినట్లు గుర్తించిన ఎన్ఐఏ.. ఆమె బంగ్లాదేశ్ నుంచి యువతుల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఆమె చెరలో ఉన్న ముగ్గురు యువతులకు వ్యభిచారం నుంచి విముక్తి కలిగించింది.
బంగ్లాదేశ్ నుంచి యువతుల్ని అక్రమంగా సరిహద్దులు దాటించి భారత్‌లోని వ్యభిచార గృహాల నిర్వాహకులకు చేర్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఘరానా మోసగాడు రుహుల్ అమిన్‌దాలి(52)ని.. శుక్రవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)అరెస్టు చేసింది. బంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బసీరత్ పట్టణంలో ఎన్‌ఐఏ రుహుల్‌ను అరెస్ట్ చేసింది. అతడి నుంచి 11 సిమ్‌కార్డులు (5 బంగ్లాదేశ్‌వి), రూ.10వేల బంగ్లాదేశ్ కరెన్సీ, వ్యభిచార గృహాల నిర్వాహకుల నంబర్లతో కూడిన డైరీని స్వాధీనం చేసుకున్నారు.