కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనల సెగ పలు రాష్ట్రాలకు పాకింది. బంగాల్లో వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు చెలరేగాయి. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల్ని దిగ్బంధించిన నిరసనకారులు.. రైల్ రోకోలతో కదం తొక్కుతున్నారు. దిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులపై పోలీసులు దాడి చేశారన్న నివేదికలతో.. ఈ ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి.
రోడ్లపై టైర్లను తగులబెట్టారు. ఆందోళనకారుల దాడిలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. నదియా, బిర్భుమ్ జిల్లాల్లోనూ పౌరచట్టానికి వ్యతిరేకంగా హింస చెలరేగినట్లు సమాచారం.
నిరసనలు ఎక్కువగా ఉన్న మాల్దా, ఉత్తర్ దినాజ్‌పుర్, ముర్షిదాబాద్, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో అంతర్జాల సేవలపై నిషేధం కొనసాగుతోంది. తూర్పు మిద్నాపుర్, ముర్షిదాబాద్‌లలో తెల్లవారుజాము నుంచే రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.
మమతా మెగా ర్యాలీ...
పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. కోల్‌కతాలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి మెగా ర్యాలీగా పాదయాత్రచేపట్టారు. కోల్‌కతా రెడ్ రోడ్డు నుంచి.. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ నివాసం వరకు నడిచారు. ఎన్ఆర్సీతో పాటు.. పౌరసత్వచట్టాన్ని రాష్ట్రంలో అనుమతించబోమంటూ పార్టీ కార్యకర్తలతో ప్రమాణం చేయించారు.
''నేను బతికున్నంతవరకు పౌరసత్వ చట్టం, ఎన్ఆర్సీని రాష్ట్రంలో అమలు చేయను. మీరెన్ని ప్రయత్నాలు చేసినా.. నేను ఈ రాజ్యాంగ విరుద్ధ చట్టాన్ని అనుమతించబోను. ఈ చట్టాన్ని రద్దు చేసేంతవరకు నేను ప్రజాస్వామ్యయుతంగా నా నిరసనను కొనసాగిస్తాను.''
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి