భారత్‌లోని కరోనా మహమ్మారి టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో.. టీకా పంపిణీపై కసరత్తు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కేంద్రాలతో పాటు అంగన్వాడీలు, పాఠశాలలు, పంచాయతీ భవనాలు సహా అలాంటి ప్రభుత్వ భవనాలను పెద్ద ఎత్తున వినియోగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ విభాగం ఈ-విన్(ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటిలిజెన్స్ నెట్వర్క్) పర్యవేక్షించనుంది. లబ్ధిదారులను గుర్తించేందుకు సందేశాలు పంపటం సహా ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్‌ను ఇవ్వనున్నారు.
కీలక అంశాలు..
- ప్రస్తుతం వినియోగంలో ఉన్న యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం(యూఐపీ)కు సమాంతరంగా ప్రత్యేక కొవిడ్-19 ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీకా బూత్‌లకు అవసరమైన భవనాలను రాష్ట్ర ప్రభుత్వాలే గుర్తిస్తాయి.
- ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ ఫ్లాట్‌ఫాం ఈ-విన్ను మరింత అభివృద్ధి చేసి.. కొవిడ్-19 టీకా పంపిణీ, సరఫరాను సమర్థవంతంగా చేపట్టేందుకు వినియోగించనున్నారు. టీకా తీసుకోవాల్సిన వారికి సరైన సమయం, తేదీ, కేంద్రం వంటి వివరాలతో సంక్షిప్త సందేశాలు పంపించనున్నారు. టీకా వేయించుకున్నవారిని గుర్తించటం, వారితో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉండేందుకు ఈ డిజిటల్ ఫ్లాట్‌ఫాం కీలకంగా మారనుంది.
- టీకా వేయాల్సిన జాబితాలో ఉన్న ప్రతిఒక్కరి ఆధార్ నంబర్‌ను డిజిటల్ విభాగంతో లింక్ చేస్తారు. దీంతో అవినీతికి ఆస్కారం ఉండదు. టీకా వేసిన, వేయించుకోవాల్సిన వారిని సులభంగా గుర్తించవచ్చు. ఆధార్ లేని వారు.. ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది.
- ఈ-విన్ వ్యవస్థ రియల్‌టైమ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న కోల్డ్ చైన్ పాయింట్స్‌లోని స్టాక్, స్టోరేజీ ఉష్ణోగ్రత వంటి వాటిని తెలియజేస్తుంది.
- టీకా అందుబాటులోకి రాగానే ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు, జిల్లాల నెట్‌వర్క్‌ల ద్వారా ఈ టీకా అందాల్సిన ప్రాధాన్యతా సమూహాలకు అందుబాటులో ఉంచటానికి.. కేంద్రమే నేరుగా కొనుగోలు చేస్తుంది. వారికి ఉచితంగా అందిస్తుంది.
- తొలి దఫాలో వ్యాక్సిన్ అందించాల్సిన సుమారు 30 కోట్ల మందిని గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది కేంద్రం. అందులో నాలుగు విభాగాలుగా విభజించింది. తొలి కేటగిరీలో 1 కోటి మంది ఆరోగ్య నిపుణులు, వైద్యులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సులు, ఆశా కార్యకర్తలు ఉంటారు. రెండో కేటగిరీలో 2 కోట్ల మంది పురపాలక కార్మికులు, పోలీసులు, సాయుధ దళాలు ఉంటాయి. మూడో కేటగిరీలో 50 ఏళ్లకు పైబడిన వాళ్లు, నాలుగో కేటగిరీలో ప్రత్యేక సంరక్షణ అవసరమైన 50ఏళ్ల లోపువారిని ఎంపిక చేయనున్నారు.
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 28వేల వ్యాక్సిన్ స్టోరేజీ కోల్డ్ చైన్ కేంద్రాలు ఉన్నాయి. మరింత ఎక్కువ డోస్‌లు స్టోరేజీ చేసేందుకు ప్రైవేటు రంగంలోని కేంద్రాలను గుర్తించే పనిలో పడింది కేంద్రం.