మహారాష్ట్రలో ఏపీ పోలీసులపై దాడి..! ఎందుకు? మహారాష్ట్ర హింగోళీలో సమాచారం ఇవ్వకుండా వచ్చిన ఆంధ్రా పోలీసులపై దాడి చేశారు గ్రామస్థులు. విచక్షణారహితంగా కొట్టారు. అసలు ఏపీ పోలీసులపై దాడి చేయడానికి కారణమేంటి? ఏమైందంటే...
గణేశ్ సీతారాం గైక్వాడ్ అనే నిందితుడ్ని అరెస్ట్ చేయడానికి సెంగావ్ తాలూకా గోరేగావ్‌లోని మాల్షీ గ్రామానికి వెళ్లారు అయిదుగురు ఆంధ్రా పోలీసులు. గణేశ్‌ను బంధించి తమ వాహనంలో వేసుకుని బయల్దేరారు. చెప్పా పెట్టకుండా తమ గ్రామస్థుడ్ని బంధించి తీసుుకవెళ్తున్న వారిని చూసి గ్రామస్థులు హడలిపోయారు.
ఏ దొంగలో లేదా ఉగ్రవాదులో అయి ఉంటారని భయపడ్డారు. ఎలాగైనా తమ గ్రామస్థుడ్ని వారి నుంచి కాపాడుకోవాలని ఆ వాహనాన్ని పొలిమేర దాటకముందే అడ్డుకున్నారు. వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచి వారిని ఓ గదిలో వేసి తాళం వేశారు. ఆపై గోరేగావ్ పోలీసులకు సమాచారమిచ్చారు.
గుర్తుతెలియని వ్యక్తులంటే.. ఉగ్రవాదులై ఉంటారనే అనుమానంతో అక్కడి పోలీసులు భారీ ఏర్పాట్లతో గ్రామానికి చేరుకున్నారు. తీరా వారిని విచారించగా తాము ఏపీ పోలీసులమని తెలిపారు.
ఇంకేముంది గ్రామస్థులు నాలుక కరుచుకుని, ముందే చెప్పి ఉంటే ఇంత గొడవ ఉండకపోయేదే అనుకున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులు నిర్వహిస్తే.. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని గోరేగావ్ పోలీసులు తెలిపారు.
అయితే మాల్షీలోని గణేష్ గైక్వాడ్‌ను ఆంధ్ర పోలీసులు ఏ అపరాధం కింద అరెస్టు చేయడానికి వచ్చారో తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:24 కుటుంబాలకు 'రేషన్' నిలిపివేత నిర్ణయం వెనక్కి..