బోల్ట్‌ను మించిన వేగం అతని సొంతం కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఐకళ ప్రాంతంలో ఈ నెల 1న నిర్వహించిన కంబళ పోటీలో వంద మీటర్ల దూరాన్ని శ్రీనివాస గౌడ కేవలం 9.55 సెకన్లలో పరుగెత్తడం సంచలనంగా మారింది. ఐకళలో తన దున్నలతో కలిసి 142.50 మీటర్ల దూరాన్ని 28 ఏళ్ల శ్రీనివాస గౌడ 13.62 సెకన్లలో పరిగెత్తినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ లెక్కన అతడు వంద మీటర్ల పరుగును కేవలం 9.55 సెకన్లలో పూర్తిచేసినట్లన్నమాట.
బోల్ట్‌ను మించిన వేగం..
ప్రస్తుతం 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు బోల్ట్ పేరిట ఉంది. 2009లో బెర్లిన్‌లో నిర్వహించిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో అతడు 9.58 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ గణాంకాలను పోల్చి చూస్తే.. వంద మీటర్ల దూరాన్ని పరిగెత్తేందుకు బోల్ట్ కంటే శ్రీనివాస గౌడ 0.03 సెకన్ల తక్కువ సమయం తీసుకున్నాడు. అంటే జమైకా వీరుడి కంటే మన గౌడ వేగవంతమైన వ్యక్తి! అయితే- బోల్ట్, గౌడ పరిగెత్తిన పరిస్థితులను ఒకేలా చూడలేం. కంబళలో దున్నల వేగం పోటీదారులకు అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. వారి వేగాన్ని పెంచుతుంది. అయితే సాధారణ రన్నింగ్ ట్రాక్‌తో పోలిస్తే కంబళలో బురద మళ్లలో పరుగు తీయడం ఇబ్బందికరమనడంలో మాత్రం సందేహమేమీ లేదు.
ఒలింపిక్స్‌కు పంపాలంటూ సూచనలు
మంగళూరు సమీపంలోని మూడబిద్రి శివారు మియారు గ్రామం శ్రీనివాస గౌడ స్వస్థలం. నిరుపేద కుటుంబానికి చెందిన అతడు పదో తరగతి వరకు చదువుకున్నాడు. 18వ ఏట నుంచి కంబళలో పాల్గొంటున్నాడు. తాజాగా ఐకళలో తీసిన పరుగుతో అతడు ఈ పోటీల్లో 30 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు. అతడి పరుగు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అతడికి శిక్షణనిచ్చి ఒలింపిక్స్‌కు పంపించాలంటూ కొందరు సూచిస్తున్నారు. మరోవైపు, తన పరుగుపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న స్పందన చూసి గౌడ ఆశ్చర్యపోతున్నాడు. "నాకు కంబళ అంటే చాలా ఇష్టం. ఈ విజయంలో నా దున్నపోతులది కీలక పాత్ర. అవి బాగా పరిగెత్తాయి. నేను వాటిని వెంబడించాను". అని అతడు పేర్కొన్నాడు.
ఏమిటీ కంబళ?
ఇది ప్రధానంగా కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయబద్ధమైన పోటీ. బురద మళ్లలో పోటీదారులు తమ దున్నలతో కలిసి వేగంగా పరిగెత్తాల్సి ఉంటుంది. నగదు బహుమతి రూ.లక్షల్లో ఉంటుంది. వేగంగా పరిగెత్తించేందుకుగాను దున్నలను పోటీదారులు కొరడాతో బలంగా కొడుతుండటంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేయడంతో కొన్నేళ్ల క్రితం కంబళను నిషేధించారు. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఆ నిషేధాన్ని తొలగించారు.