తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పర్యావరణ పరిరక్షణకై ఐరాసలో భారత యువతి ఫిర్యాదు - ఐక్యరాజ్య సమితి

వాతావరణ మార్పులపై వివిధ దేశాలకు చెందిన 16 మంది యువత ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేశారు. ఆ బృందంలో భారత్​కు చెందిన రిధిమా పాండే ఉన్నారు. 11 ఏళ్ల వయసులోనే పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ అందరి మన్ననలు పొందుతోంది.

పర్యావరణ పరిరక్షణకై ఐరాసలో భారత యువతి ఫిర్యాదు

By

Published : Sep 27, 2019, 10:57 PM IST

Updated : Oct 2, 2019, 7:02 AM IST

పర్యావరణ పరిరక్షణకై ఐరాసలో భారత యువతి ఫిర్యాదు

పర్యావరణ మార్పులపై కొన్ని రోజులుగా ప్రపంచ దేశాల్లోని యువత ఆందోళనలు చేపడుతున్నారు. ప్రభుత్వాల పనితీరుపై విమర్శలు చేస్తూ.. పర్యావరణ పరిరక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. వాతావరణ మార్పులపై వివిధ దేశాలకు చెందిన 16 మంది యువ కార్యకర్తల బృందం ఇటీవలే ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో స్వీడన్​కు చెందిన గ్రెటా థన్​బర్గ్​ అనే యువతి ఐరాస సమావేశంలో దేశాధినేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణ చర్యల అవసరాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

గ్రెటా థన్​బర్గ్​ నేతృత్వంలోని 16 మంది బృందంలో భారత్​కు చెందిన రిధిమా పాండే ఉన్నారు. చిన్నతనం నుంచి పర్యావరణ మార్పులపై పోరాడుతున్న 11 ఏళ్ల రిధిమా.. ఐరాసలో ఫిర్యాదు చేశారు.

ఉత్తరాఖండ్​లోని ఆధ్యాత్మిక నగరం హరిద్వార్​కు చెందిన దినేశ్​ పాండే కుమార్తె రిధిమా పాండే. 2013లో ఉత్తరాఖండ్​ను ముంచెత్తిన వరదలతో నెలకొన్న మార్పులతో విసుగు చెందింది. గంగా నది కాలుష్యం ఆమెను వాతావరణ మార్పులపై పోరాటం వైపు నడిపించింది. గంగానదిలో ఉండే విగ్రాహలు, బట్టలు, ప్లాస్టిక్​ వస్తువులను చూస్తూ పెరిగిన ఆమె ఈ చర్యల్లో మార్పు తీసుకురావాలని సంకల్పించుకుంది.

"నేను పోరాటం చేస్తున్నాను. ఎలాంటి తప్పు చేయటం లేదు. 15 మంది ఇతర దేశాలకు చెందిన పిల్లలు కూడా ఇదే అడుగుతున్నారు. భూతాపం అనేది పెద్ద సమస్య. భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. భూతాపాన్ని కట్టడి చేయలేకపోతే భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దానితోనే మనం ఇబ్బందులు పడుతున్నాం. నేను అలా ఉండాలనుకోవట్లేదు. అది మనకు ఉన్న జీవించే హక్కు. పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన వాతావరణంలో నివాసం, శుభ్రమైన గాలి అనేది మన హక్కు. ప్రభుత్వాలు మన హక్కులను కాలరాస్తున్నాయి. "

- రిధిమా పాం డే, పర్యావరణ కార్యకర్త.

తన కుమార్తె లక్ష్యం దిశగా... తండ్రి దినేశ్​ పాండే ఎంతో సహకారం అందించారు. వృత్తి రిత్యా వన్యప్రాణుల సంరక్షకుడైన దినేశ్​.. రిధిమాను ప్రోత్సహించేవాడు. ఆమె అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తూ.. భూతాపం, కాలుష్యంపై పూర్తిగా అర్థమయ్యేలా వివరించేవాడు.

"పెద్దవాళ్లు కేవలం మాటల్లోనే చెబుతారు. అది సరైంది కాదు. భవిష్యత్తు తరాలకు ప్రభుత్వాలు నమ్మక ద్రోహం చేస్తున్నాయి. నా కూతురికి మద్దతుగా నిలుస్తున్నా. ఈ మిషన్​లో అంతర్జాతీయ స్థాయిలో అందరితో పాటు నా కూతురు నిలబడటం నాకు గర్వంగా ఉంది."

- దినేశ్​ పాండే, రిధిమా తండ్రి.

పర్యావరణ మార్పులపై పోరాటానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తోంది రిధిమా.

2017లో హరిత ట్రైబ్యునల్​కు..

పర్యావరణ మార్పులపై తొలిసారి 2017లో భారత జాతీయ హరిత ట్రైబ్యునల్​లో పిటిషన్​ దాఖలు చేసింది రిధిమా. కానీ ఆమె ఫిర్యాదుకు ఆదరణ లభించలేదు. తిరస్కరణకు గురైంది. అంతటితో నిరుత్సాహం చెందకుండా సుప్రీం కోర్టునూ ఆశ్రయించింది.

ఇదీ చూడండి:ఉగ్రవాదంపై ఏకం కండి: ఐరాస సదస్సులో మోదీ

Last Updated : Oct 2, 2019, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details