వ్యవసాయ రంగంలో స్వావలంబన, రైతులు స్వయం సమృద్ధత సాధించడమే 'ఆత్మ నిర్భర్ భారత్' ప్రాధాన్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశంలోని రైతులకు ఆధునిక మౌలిక సదుపాయాలను అందించడం కోసమే.. లక్ష కోట్ల రూపాయలతో 'వ్యవసాయ మౌలికవసతుల నిధి'ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.
వారి ఖాతాల్లో రూ.90 వేల కోట్లు...
భాజపా ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు ప్రధాని. పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.90వేల కోట్లు బదిలీ చేసినట్టు వెల్లడించారు. 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. 7 కోట్ల పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించినట్టు తెలిపారు.