చెట్లపై అమితమైన ప్రేమతో ఓ వ్యాపారి.. ఉరుకుల పరుగుల జీవితంలోనూ తన ఇంటిని చిన్నపాటి అడవిగా మార్చేశాడు. కర్ణాటక, మంగళూరులోని కొడికల్‌కు చెందిన కృష్ణ గోవింద.. తన ఇంటిచుట్టూ 300 రకాల చెట్లు పెంచుతున్నాడు. పదవీవిరమణ తర్వాత, రెండేళ్లుగా ఇదే ఇంట్లో ఉంటున్న కృష్ణ గోవింద.. తన నివాసాన్ని గ్రీన్‌హౌజ్‌గా తీర్చిదిద్దుకున్నాడు.
"ఇక్కడ ఈ మొక్కలు నాటే సమయంలో స్థలం సరిపోక ఇబ్బందులు పడ్డా. ఇల్లు కట్టుకున్న తర్వాత మిగిలిన చోటులో మొక్కలు పెంచుకున్నా. నాలాగే ఇంట్లో చిన్నపాటి తోట పెంచుకోవాలి అనుకునేవారికి పూర్తి సహకారమందిస్తా."
-- కృష్ణ గోవింద, పర్యావరణ ప్రేమికుడు.
వాడేసిన వాటితో..
కృష్ణ గోవింద ఇల్లంతా మొక్కలు, చెట్లే కనిపిస్తాయి. ఈ విభిన్న రకాల మొక్కలన్నింటినీ.. ప్లాస్టిక్ సీసాలు, క్యాన్లు, పెయింట్ బకెట్లు, వెదురుబొంగులు, వాడేసిన కొబ్బరి టెంకల్లోనే పెంచుతున్నాడు కృష్ణ. తాను పెంచుకుంటున్న చిరుఅడవిలో, అన్నిరకాల పండ్లు, కూరగాయలు పండిస్తున్నాడు.
"వంటగదిలో వాడేసిన ఏ వస్తువూ వృథాగా పోకూడదు. ఆ వ్యర్థాలు పారేయడానికి బదులు, వాటిని ఎండబెట్టి, పేడతో కలిపి, మొక్కలకు అందించొచ్చు. మొక్కల పెరుగుదలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. "