చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఈ నిబంధన మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుందని నిరూపించారు మధ్యప్రదేశ్ నర్సింగ్పుర్ గోటెగావ్ పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై నడిచిన ఓ ఏనుగును.. మావటివాళ్ల వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేనందున అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు, వీఐపీ ఖైదీ హోదా ఇచ్చి.. ఓ రోజంతా గజరాజు ఆలనా పాలనా చూసుకున్నారు. ఆరోగ్య, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.
"ఏనుగుతో మావటి వాళ్లు రోడ్డుపై వెళుతూ కనిపించారు. వారితో మాట్లాడాం.. వారు కొన్ని కాగితాలు సమర్పించారు. అయితే అటవీశాఖ ఓ ధ్రువీకరణ పత్రం ఇస్తుంది అది వారి దగ్గర లేదు. దాని కోసం వారు దరఖాస్తు చేసుకున్నారట.. కానీ, ఇంకా ఇవ్వలేదు. అందుకే జంతు సంరక్షణలో భాగంగా ఏనుగును అదుపులోకి తీసుకున్నాం. మా దగ్గరికి వచ్చాక దానికి బాధ్యతగా ఆహారం పెట్టాం. ఎలాంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. వైద్య పరీక్షలు కూడా చేయించాం."
-ప్రభాత్ శుక్లా, పోలీస్ అధికారి