పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించడంలో ఇప్పటికే తంటాలు పడుతున్న భారత్‌ను భూక్షీణత సమస్య వేధిస్తోంది. ఫలితంగా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం అధికమవుతోంది. అటవీ నిర్మూలన, అతిగా సాగు చేయడం, మృత్తికా క్షయం, చిత్తడి నేలల తగ్గుదల వంటి పలు కారణాలతో భారతదేశంలో 30 శాతానికిపైగా భూమి (9.6 కోట్ల హెక్టార్లు) క్షీణతకు గురైంది. దీనివల్ల పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడటంతోపాటు, వాతావరణ మార్పులకూ ఇది కారణమవుతోంది. ఈ పరిస్థితులన్నీ తిరిగి మరింత భూక్షీణతకు దారితీస్తున్నాయి.
వాతావరణ మార్పులను నిలువరించడంలో అడవులే అత్యంత కీలకం. భారత్‌లో 2018 నాటికి 16 లక్షల హెక్టార్ల మేర అడవులకు ముప్పు వాటిల్లింది. 2015 నాటికి అయిదేళ్ల కాలవ్యవధిలో కోటికిపైగా వృక్షాలను పడగొట్టేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దేశంలో 500పైగా ప్రాజెక్టులు రక్షిత ప్రదేశాలు, పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో ఉన్నాయి. వీటికి మోదీ ప్రభుత్వ హయాములో 2014 జూన్ నుంచి 2018 మే వరకు తొలి నాలుగేళ్లలో జాతీయ వన్యమృగ బోర్డు ఆమోదం తెలిపింది. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం 2009 నుంచి 2013 వరకు 260 ప్రాజెక్టుల్ని ఆమోదించింది.
భారత్ పై ఆహార భద్రత ముప్పు
ఐరాస గణాంకాల ప్రకారం- భారత్ పాలు, పప్పు ధాన్యాలు, జౌళి రంగాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా పేరొందింది. వరి, గోధుమ, చెరకు, వేరుసెనగ, కూరగాయలు, పండ్లు, పత్తి సాగులో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా పేరు గడించింది. అయితే, పర్యావరణానికి హాని కలిగే పరిస్థితులు ఇదే తరహాలో కొనసాగితే, దేశంలో 80 శాతం చిన్న-సన్నకారు రైతులు సమీప భవిష్యత్తులో తీవ్రస్థాయిలో ప్రభావితమయ్యే ప్రమాదముంది. వ్యవసాయ ప్రధానమైనదిగా పేరొందిన భారత ఆర్థిక వ్యవస్థ సైతం ఆహార భద్రత ముప్పు బారిన పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినపడుతున్నాయి. పశువుల వృద్ధి, ఉత్పాదకతపైనా భూక్షీణత ప్రభావం పడి, వాతావరణ మార్పులకు దారితీసే అవకాశం ఉందని ఐరాసకు చెందిన వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వ కమిటీ(ఐపీసీసీ) వెల్లడించింది.
పర్యావరణ వ్యతిరేక చర్యల్ని అడ్డుకునే విషయంలో 2006లో ఆమోదం పొందిన అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ) ఉపయుక్త ఉపకరణం. ఎన్నో తరాలుగా అడవుల్లో జీవిస్తున్న వారికి రక్షణ కల్పిస్తూ అటవీ భూమిపై, సహజ వనరులపై వారి హక్కుల్ని ఈ చట్టం గుర్తిస్తుంది. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల హెక్టార్ల అటవీ భూమి ఉండగా, 2019 ఏప్రిల్ 30 నాటికి సుమారు 1.3 కోట్ల హెక్టార్ల భూములకు సంబంధించిన ఎఫ్‌ఆర్‌ఏ వివాదాలనే ప్రభుత్వం పరిష్కరించగలిగింది. దీనికితోడు, 20 లక్షల మంది అటవీ నివాసుల కుటుంబాలకు సంబంధించిన ఎఫ్‌ఆర్‌ఏ హక్కులపై వాదనలు తిరస్కరణకు గురైన నేపథ్యంలో- సుప్రీంకోర్టులో ప్రస్తుతమున్న కేసు వారి నెత్తిన కత్తిలా మారి భయపెడుతోంది. ప్రస్తుతం 21 రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా తిరస్కరణకు గురైన అంశాల్ని సమీక్షించే పనిలో ఉన్నాయి.