కరోనాపై ప్రస్తుతం దేశం మొత్తం ఏకతాటిపై చేస్తోన్న పోరాటానికి మొత్తం ముస్లిం సమాజం మొత్తంగా అండగా నిలవాలని మైనార్టీ వర్గానికి చెందిన 80 మంది అఖిలభారత సర్వీసు అధికారులు పిలుపునిచ్చారు.
తబ్లీగీ జమాత్ సమ్మేళనం ఉదంతం తర్వాత ముస్లిం సముదాయం ఉద్దేశపూర్వకంగా వైరస్ వ్యాప్తి చేస్తోందనే ప్రచారం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రచారం...
కొందరు ముస్లింలు ప్రభుత్వ సూచనలు పాటించకుండా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకరించడం లేదని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. సామాజిక దూరం పాటించడం లేదని, వైద్య సిబ్బందిపై దాడులు చేస్తున్నారని, పోలీసులతో అమర్యాదగా ప్రవరిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రచారమవుతున్నాయి.
బాధ్యతాయుతంగా..
ఇలాంటి తీవ్ర సంక్షోభ సమయంలో భారతదేశంలో ఉన్న ముస్లింలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు. వైరస్‌కు వ్యతిరేకంగా చేస్తోన్న ఈ పోరాటంలో ముస్లింలు ఆదర్శంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
"ఒకరు మద్దతిస్తున్నారా? లేదా? అది మతగ్రంథాల్లో ఉందా? లేదా ? అనే దాంతో సంబంధం లేకుండా ఏది మంచిదో దాన్ని అనుసరించాలి. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం వైరస్ స్వీయ సంక్రమణం కూడా పాపమే. నిర్లక్ష్యం, దుందుడుకు చర్యల ద్వారా ఆత్మహత్య, ప్రమాదం, వ్యాధుల వ్యాప్తికి కారణమవడం తప్పు. వైరస్‌ను వ్యాప్తి చేస్తే.. కుటుంబం, సమాజంలో విస్తరించి అమాయకుల ప్రాణాలు తీస్తుంది. 'ఒక అమాయకుడిని చంపితే మొత్తం మానవాళిని చంపినట్లే, ఒకరిని కాపాడినా మొత్తం మనుషులను రక్షించినట్లేనని' ఖురాన్ చెబుతోంది. క్వారంటైన్లో ఉండటానికి ఎలాంటి మతపరమైన ఆంక్షలు లేవు. మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నించడం వివేకవంతమైన చర్య"
- అఖిల భారత సర్వీసు అధికారులు
సహకరించండి!
'ప్రస్తుతం సమయంలో తాత్కాలికంగా మసీదుకు పోనంత మాత్రాన మనం దాన్ని శాశ్వతంగా వదిలేసినట్లు కాదు. సామాజిక దూరం పాటిస్తూ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవచ్చు. పౌరుల బాధ్యతాయుతమైన ప్రవర్తన దేశాన్ని రక్షిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులంతా ముందుకొచ్చి వైరస్ వ్యాప్తి నిరోధాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు చేయుతనివ్వాలి' అని 80మంది అఖిల భారత సర్వీసు అధికారులు ముస్లింలకు విన్నవించారు.
ఇదీ చూడండి:కరోనా భూతంపై జనభారతం ఐక్య పోరాటం