తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్‌, చైనా సరిహద్దు వివాదం.. చర్చలతోనే పరిష్కారం - china india border

చైనాతో సరిహద్దు వివాదం మరోస్థాయికి చేరకముందే భారత్ తెలివిగా అడుగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్​తో పోలిస్తే చైనా కనీసం రెండు దశాబ్దాలు ముందుంది. ఈ నేపథ్యంలో భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ భారత్‌పై చైనా అవాంఛనీయ దూకుడు ప్రదర్శిస్తే ప్రపంచం దృష్టిలో ‘బీజింగ్‌’ విశ్వసనీయత దెబ్బతింటుంది. మితిమీరిన దూకుడుతో వ్యవహరించే చైనా విషయంలో, భారత్‌కు సహకరించేందుకు ప్రపంచ దేశాలు కదిలివచ్చే అవకాశాలు కొట్టిపారేయలేనివని నిపుణులు భావిస్తున్నారు.

indo china
భారత్‌, చైనా సరిహద్దు వివాదం.. చర్చలతోనే పరిష్కారం

By

Published : Jun 16, 2020, 7:48 AM IST

చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంలో భారత్‌ సహనంతో, తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇరుదేశాలు ప్రపంచ శక్తులుగా ఎదగాలనే ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నాయి. చైనా కనీసం రెండు దశాబ్దాలు ముందుంది. తిరోగమన, తప్పుడు ఆర్థిక, రాజకీయ విధానాల కారణంగా మనదేశం చాలా నష్టపోయింది. అలాగని మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. భారత్‌ దెబ్బతిన్న 1962తో పోలిస్తే, నేడు చాలా మెరుగైన సాధనసంపత్తి గల స్థితిలో ఉంది. ఆర్థిక వ్యవస్థతోపాటు, సైనిక తదితర మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారీ అడుగులు పడాల్సి ఉంది. సైనికపరంగా, ఆర్థికపరంగా చైనాతో సమాన స్థాయిలో నిలబడాలంటే సుదీర్ఘ పయనం సాగించాల్సి ఉంది. చిన్నపాటి దేశమైన వియత్నాం అత్యంత శక్తిమంతమైన సైనిక శక్తిని ఎలా ఎదిరించిందో గుర్తుకుతెచ్చుకోవాలి. రెండు అణు సామర్థ్య దేశాలైన చైనా, భారత్‌ సరిహద్దుల్లో భారీ దుస్సాహసానికి పాల్పడే అవకాశాలు తక్కువే. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీలాంటి బలమైన నేత ఉన్న నేపథ్యంలో- తాజా సంక్షోభానికి గౌరవప్రదమైన పరిష్కారాన్ని సాధిస్తారనే ఆశించవచ్ఛు ప్రస్తుత ప్రతిష్టంభన ఏదో ఒక సమయంలో సమసిపోయే అవకాశాలే అధికం. గట్టిగా సంప్రదింపులు జరపడం ద్వారా వాస్తవాధీన రేఖ వద్ద ప్రాదేశిక భూభాగాల కోసం పోటీలు పడటంపై విభేదాలు తగ్గడానికి కొన్ని వారాలు, కాకపోతే మరికొన్ని నెలల వ్యవధి పడుతుందంతే. 2017లో తలెత్తిన డోక్లాం ప్రతిష్టంభన చర్చల ద్వారా నెల రోజుల తరవాత పరిష్కారమైన సంగతి గుర్తుంచుకోవాలి. ఆ విషయంలో భారత్‌, భూటాన్‌ ఇరు దేశాలూ సంతృప్తి చెందాయి. ఇరుపక్షాలు ఎంతోకొంత ఇచ్చిపుచ్చుకొనే ధోరణిని ప్రదర్శించకపోతే, ప్రతిష్టంభన మరింత ముదిరి పరిష్కరించలేని స్థాయికి చేరుతుంది.

గౌరవం కోల్పోతున్న డ్రాగన్‌

వాస్తవాధీన రేఖను చైనా గౌరవించకపోవడం ఇదేమీ తొలిసారి కాదు. పరిష్కారం కోసం ఇరు ప్రభుత్వాలు ప్రయత్నాలు జరిపినా, విఫలమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో వివాద పరిష్కారంవైపు చైనా మొగ్గు చూపినా, అప్పట్లో నెహ్రూ ఆసక్తి కనబరచలేదు. 1959లో దలైలామా, ఆయన అనుచరులకు ఆశ్రయం కల్పించడంతో, అప్పట్నుంచి చైనా వైఖరి కఠినంగా మారింది. ప్రస్తుతం ఆర్థికంగా, సైనికపరంగా బాగా శక్తిని సముపార్జించుకున్న చైనా తన విదేశాంగ విధానం ద్వారా బలాన్ని ప్రదర్శించేందుకు యత్నిస్తోంది. చైనా తన వాణిజ్య విధానాలను నిరోధిస్తున్న అమెరికా, ఐరోపా తదితర దేశాలతో బహిరంగ ఘర్షణకు దిగుతున్న ఉదంతాలున్నాయి. చైనా అందరినీ భయపెట్టేందుకు యత్నిస్తుండవచ్చుగానీ, ఆ క్రమంలో ప్రపంచ దేశాల్లో గౌరవం పోగొట్టుకుంటుందనే అభిప్రాయాలున్నాయి. చైనా తన పొరుగు దేశాలపై బలప్రదర్శన చేయాలని చూస్తోందనే భావన నెలకొంది. దక్షిణ చైనా సముద్రంలో అనుబంధ దీవుల విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్నే ధిక్కరించిందనే విమర్శలున్నాయి. వుహాన్‌ నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి జరిగిందనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండు చేసిన ఆస్ట్రేలియాతో ఇటీవల ఆర్థిక ఘర్షణలకు దిగడమూ ఆ కోవలోనిదే. ప్రస్తుతం లద్దాఖ్‌లో రహదారి సౌకర్యాల్ని, వైమానిక మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడం, దౌలత్‌బేగ్‌ ఓల్డీ ప్రాంతంలోని రహదారిని సరిహద్దులతో అనుసంధానించడం వంటి పనులు చేపట్టడంపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తాజా వివాదంలో స్థానిక స్థాయిలో చర్చలు విఫలమైన తరవాత కోర్‌ కమాండర్ల మధ్య చర్చలకు తెరతీశారు. ఇందులో తొలి విడత చర్చల దరిమిలా ఇరుపక్షాలు ఒకటి లేదా రెండు కిలోమీటర్ల మేర వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాయి.

తాత్కాలికంగా ఊరట

ప్రస్తుత సరిహద్దు వివాదంపై ఇరుదేశాలూ ఒక అంగీకారానికి వచ్చాయని వాస్తవాధీనరేఖ వద్ద కొన్ని ప్రదేశాల విషయంలో పాక్షిక విభేదాలకు దారి తీసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంటుందనే భావిస్తున్నారు. ఈ ప్రాంతం చైనాకు చాలా కీలకం. దూకుడుతో కూడిన విధానం ద్వారా స్వదేశంలో, విదేశాల్లో శక్తిని చాటుకోవాల్సిన అగత్యం ప్రస్తుతం దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ ముందుందన్నది అక్కడి పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జిన్‌పింగ్‌ను బలమైన నేతగా ప్రపంచం గుర్తిస్తోంది. హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని ఎలా అణచివేశారో, సైనిక చర్యతో అణగదొక్కేస్తామంటూ తైవాన్‌ను ఎలా హెచ్చరించారో గమనించాలి. వుహాన్‌లో పుట్టిన వైరస్‌ ప్రపంచానికంతా వ్యాపించిందనే ఆరోపణలున్న క్రమంలో వారి ఉదాసీన వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల దృష్టిలో మంచిపేరును చైనా బలహీనపరచుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్‌పై అవాంఛనీయ దూకుడు ప్రపంచం దృష్టిలో ‘బీజింగ్‌’ విశ్వసనీయతకే తూట్లు పొడుస్తోంది. భారత్‌కు ద్వైపాక్షికంగా సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం ఉంది. అవతలి పక్షం నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా మితిమీరిన దూకుడుతో వ్యవహరించే చైనా విషయంలో, భారత్‌కు సహకరించేందుకు ప్రపంచ దేశాలు కదిలివచ్చే అవకాశాలు కొట్టిపారేయలేనివి.

-రచయిత: వీరేంద్ర కపూర్

ఇదీ చూడండి:కరోనాపై సీఎంలతో ప్రధాని సమీక్ష.. లాక్​డౌన్ 6.0 దిశగా ?

ABOUT THE AUTHOR

...view details