విద్యుత్ సరఫరా సంస్థలు వినియోగదారులకు అందించిన ప్రతి యూనిట్ కరెంటునూ లెక్కగట్టి వారినుంచి డబ్బు వసూలు చేయడం కష్టతరమవుతోంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ‘పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్’ నివేదిక ప్రకారం, సరఫరా చేసిన విద్యుత్తులో కేవలం 83శాతానికి మాత్రమే లెక్క తేలుతోంది. తక్కిన 17శాతానికి లెక్క తెలియకపోవడంతో సంబంధిత సంస్థలు ఏటా ఒక లక్ష 15వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నాయి.
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు...
లెక్కగట్టిన బిల్లులపై సరాసరి 93 శాతం మాత్రమే వసూలు చేయగలగడంతో విద్యుత్ సరఫరా సంస్థలు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. వీటిలో సాంకేతిక నష్టాలను మినహాయిస్తే- ఇతర, వాణిజ్యపరమైన నష్టాలు, మీటర్ రీడింగ్‌లో తేడాలు, విద్యుత్ చౌర్యం వంటివి సమర్థమైన బిల్లింగ్ విధానంద్వారా నిరోధించవచ్ఛు ఈ సమస్యను అధిగమించడం కోసం- అనేక సరఫరాసంస్థలు గత 15 సంవత్సరాలుగా పూర్వకాలపు మీటర్లను తొలగించి, అత్యంత నాణ్యమైన ఎలెక్ట్రానిక్ మీటర్లను బిగించాయి. వినియోగదారుడి ఇంటివద్దే చేతిలో ఇమిడే పరికరంతో బిల్లులు అక్కడికక్కడే అందిస్తున్నాయి. ఈ విధానంలో మానవ వనరుల వినియోగం పెరుగుతోంది. అయినప్పటికీ వినియోగదారుల నుంచి అనేక ఫిర్యాదులను సంబంధిత సరఫరా సంస్థలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదిత్య పథకాన్ని ప్రతిపాదించి- వచ్చే మూడేళ్లలో సరఫరా సంస్థలు ఇప్పుడున్న మీటర్లకు బదులుగా ప్రిపెయిడ్ స్మార్ట్‌మీటర్లను నెలకొల్పి నష్టాలను 12 శాతానికి తగ్గించుకోవాలని సూచించింది.
స్మార్ట్ మీటర్ అంటే?
స్మార్ట్‌మీటరు- ఇప్పుడున్న మామూలు ఎలెక్ట్రానిక్ మీటర్‌లాగా విద్యుత్ వినియోగాన్ని నమోదు చేయడమే కాకుండా, అదనంగా జీఆర్‌పీఎస్ సెల్ సిమ్‌తో అంతర్జాలంద్వారా ప్రతి గంటకు వాడకంలో ఉన్న లోడును సంబంధిత సంస్థలకు, వినియోగదారుడికి అందజేస్తుంది. మీటరు ఏ కారణంచేతనైనా పనిచేయకపోయినా, వినియోగదారుడు చౌర్యానికి పాల్పడినా... ఆ సమాచారం సంబంధిత సంస్థకు వెంటనే తెలిసిపోతుంది. ఎటువంటి లోపాలు లేని కచ్చితమైన పారదర్శక విద్యుత్ బిల్లుల జారీ అమలవుతుంది. కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో దేశంలోని సరఫరా సంస్థలు గత మూడునెలలుగా వినియోగదారుల వద్దకు వెళ్లలేక, గడచిన సంవత్సరపు పాతబిల్లులనే కట్టమని కోరింది. అనేక సందిగ్ధతలతో, కేవలం 50శాతం లోపు వినియోగదారులే బిల్లులు చెల్లించడంతో, పూర్తిస్థాయి ఆదాయం రాక సరఫరాసంస్థలు ఆర్థికంగా కుంగిపోయాయి. ఇప్పుడు ఒకేసారి మూడునెలల వినియోగంతో, జారీచేస్తున్న బిల్లులపైనా అనేక అపోహలతో వినియోగదారుల్లో నిరసన వెల్లువెత్తుతోంది.