ఎన్నో యుద్ధాల పెట్టుగా సర్వానర్థ కారకమవుతున్న కరోనా దేశీయంగా మహానగరాలపై కర్కశంగా కోరచాస్తోంది. వైద్య ఆరోగ్య సేవారంగంలో మూడొంతులు కేంద్రీకృతమైన మహానగరాలే కొవిడ్ కేసుల ఉరవడికి కుదేలైపోతున్న దురవస్థ గుండెల్ని పిండేస్తోంది. దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి భయావహంగా, దయనీయంగా ఉందన్న సుప్రీంకోర్టు- దిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార సరళిని సూటిగా తప్పుపట్టింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మూడు లక్షల 30 వేలు దాటగా అందులో దాదాపు మూడోవంతు వాటా మహారాష్ట్రదే. ఇండియాలో కొవిడ్ కేసులు మూడు లక్షలకు చేరడానికి నాలుగున్నర నెలలు పట్టిందని, రోగుల సంఖ్య రెట్టింపు అయ్యే కాలావధి వారం నుంచి పదిహేను రోజులకు విస్తరించిందని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) గణాంకాలు వల్లెవేస్తున్నాయి.
నెలాఖరుకు 5 లక్షలకు పైనే
క్షేత్రస్థాయిలో అనేక లొసుగులు అభాగ్య రోగుల్ని కుంగదీసేవే! కరోనా పెరుగుదల రేటు ఇలాగే కొనసాగితే వచ్చే నెలాఖరుకు దేశరాజధానిలోనే కేసుల సంఖ్య 5.5లక్షలకు చేరి 80వేల ఆసుపత్రి పడకలు అవసరమవుతాయని కేజ్రీవాల్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. 'సుప్రీం' తలంటు నేపథ్యంలో కేంద్ర హోం, ఆరోగ్య శాఖ మంత్రులతో కేజ్రీవాల్ భేటీ- కొవిడ్ వ్యాధిగ్రస్తులకు తక్షణ సాంత్వన కలిగించే నిర్ణయాల్ని వెలువరించింది.
కొవిడ్ రోగులకు స్వస్థత కూర్చే సౌకర్యాలతో ఎనిమిది వేల పడకలుగా అభివృద్ధి చేసిన 500 రైలు పెట్టెలను కేటాయించడం, కరోనా పరీక్షల్ని ఆరు రోజుల్లో మూడింతలు చెయ్యడం, దిల్లీలోగల 219 కంటైన్‌మెంట్ జోన్లలో ప్రతి ఒక్కరికీ సమగ్ర ఆరోగ్య సర్వే సత్వరం చేపట్టడం వంటి మేలిమి నిర్ణయాలు- కరోనాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పోరాట స్ఫూర్తికి ఆనవాళ్లు. వచ్చే 80 రోజుల్లో దేశవ్యాప్తంగా కేసులు పాతిక లక్షలకు చేరతాయంటున్న అంచనాల దృష్ట్యా- రాష్ట్రాలకు కేంద్రం ఇతోధిక తోడ్పాటు, మార్గదర్శకత్వం తప్పనిసరి!