అమెరికా, చైనాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్య పోరుకు కరోనా వైరస్ ఆజ్యం పోసింది. మొదటి ప్రపంచయుద్ధం నాటి నుంచే వినియోగిస్తున్నట్లు అనుమానిస్తున్న 'జీవాయుధం' అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. కరోనా వైరస్ యాదృచ్ఛికంగా పురుడు పోసుకున్నది కాదని, తన ఆర్థిక శక్తిని పెంచుకునేందుకు చైనా ప్రపంచం మీద ప్రయోగించిన జీవాయుధమని అమెరికా బలంగా విశ్వసిస్తోంది. దీన్ని నిర్ధారించడానికి గట్టి సాక్ష్యాధారాలు ప్రస్తుతం ఎవరివద్దా లేనప్పటికీ- కరోనా పుట్టుక, వ్యాప్తిలోని మర్మాన్ని నిగ్గదీసే బాధ్యతను ప్రపంచ దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు కట్టబెట్టాయి.
విజృంభిస్తున్న మహమ్మారి
కరోనా వైరస్‌వల్ల మానవాళికి జరిగే నష్టాన్ని ఇప్పటికిప్పుడు నిర్దిష్టంగా అంచనా వేయలేనప్పటికీ- దశాబ్దాలపాటు దీని ప్రభావం దేశాల ఆర్థిక, సామాజిక, దౌత్య సంబంధాలను తీవ్రమైన కుదుపునకు గురిచేస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమ్మెటపోటుకు గురికాక తప్పదు. ఈ వైరస్ సోకే విధానం, విజృంభించే తీరు అసాధారణ రీతిలో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అనతికాలంలోనే ఇది 200 పైగా దేశాలను చుట్టుముట్టింది. ప్రజలను కొన్ని నెలలపాటు స్వీయ నియంత్రణకు, గృహ నిర్బంధానికి గురిచేసింది. వాణిజ్య, ఉద్యోగ వ్యవహారాలను అతి పెద్ద లాక్‌డౌన్ ద్వారా స్తంభింపజేసింది.
అతి పెద్ద సంక్షోభం!
ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ దీన్ని రెండో ప్రపంచయుద్ధం తరవాత సంభవించిన అతి పెద్ద సంక్షోభంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు దీన్ని జీవాయుధంగా వినియోగిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తలచుకుంటే ఆందోళన కలుగుతోందన్నారాయన. దీన్నిబట్టి ఈ వైరస్ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వైరస్ జననం, గమనం, విస్తృతిని పరిగణనలోకి తీసుకున్న సైనిక నిఘా వర్గాలు వైరస్ వ్యాప్తిని 'పాక్షిక జీవ యుద్ధం(క్వాసీ బయోవార్)'గా పరిగణిస్తున్నాయి.
చేతికి మట్టి అంటకుండా
ప్రకృతిసిద్ధంగా సంభవించే మహమ్మారులకు; శత్రు దేశాలను అశాంతి, అస్థిరతలకు గురి చేయడానికి మానవులు వైరస్‌లను జీవాయుధాలుగా ప్రయోగించడానికి మధ్య తేడా ఉంది. డాలస్‌లోని బేలోర్ యూనివర్సిటీ వైద్య కేంద్రంలో జీవ రోగనిర్ధారణ శాస్త్రవేత్త డాక్టర్ స్పెషార్ రీడల్ అభిప్రాయం ప్రకారం జీవాయుధం- చేతికి మట్టి అంటకుండా శత్రువును ముప్పుతిప్పలు పెట్టి, లొంగదీసుకునే ఒక సాధనం. దీన్ని జాతి వినాశనానికి చేసే ప్రత్యామ్నాయ యుద్ధంగా ఆయన అభివర్ణిస్తున్నారు. సైన్యం ప్రమేయం లేకుండా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ, ప్రజలను అశాంతికి గురి చేస్తూ, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ శత్రువుకు ఊపిరి తీసుకునే అవకాశం సైతం ఇవ్వకుండా చేయడం జీవాయుధ యుద్ధ విధానం.
నిఘా వ్యవస్థల పాత్ర కీలకం