కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి.. లోక్సభలో సోమవారం చేసిన ఆరోపణలపై స్పందించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అధిర్ వ్యాఖ్యలను ఖండించారు. తాను రవీంద్రనాథ్ ఠాగూర్ కుర్చీలో కూర్చోలేదని వివరణ ఇచ్చారు. ఎక్కడ కూర్చున్నానో తెలుసుకునేందుకు విశ్వభారతి వైస్ ఛాన్స్లర్ను అడిగానని.. తప్పేదీ జరగలేదని ఆయన చెప్పినట్లు సభలో వివరించారు.
''నేను ఎక్కడ కూర్చున్నానో తెలుసుకునేందుకు విశ్వభారతి వైస్ ఛాన్స్లర్ను ఓ నివేదిక కోరాను. నేను కూర్చున్న స్థానంలో ఎవరైనా కూర్చునే అవకాశం ఉంటుందని ఆయన నాకు చెప్పారు. ఆ ఫొటోలు, వీడియోలు చూసి చెప్పండి. నేను ఠాగూర్ సీట్లో కూర్చున్నానో.. లేదో?. ''
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూర్చున్న స్థానంలోనే తానూ కూర్చున్నట్లు పేర్కొన్నారు. పర్యటకులకూ అక్కడ కూర్చొనే అవకాశం ఉంటుందని చెప్పారు.