ఓ వైపు బిహార్ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతూనే.. బంగాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది భారతీయ జనతా పార్టీ. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ను.. కూకటి వేళ్లతో పెకిలించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగానే బంగాల్ ఎన్నికల బాధ్యతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేపడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బంగాల్ ఎన్నికలను భాజపా సెంటిమెంట్ అంశంగా భావిస్తోందని తెలిపాయి.
"బంగాల్లో భాజపా కార్యకర్తలపై దాడులు జరిగిన క్రమంలో.. దుర్గ పూజ సందర్భంగా రాష్ట్రంలో పర్యటించి అందరితో సమావేశమవుతానని భరోసా కల్పించారు అమిత్ షా. పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు, ఎమ్మెల్యేలతో సమావేశంపై తన ప్రణాళికను పంచుకున్నారు. బంగాల్లో షా పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ ప్రణాళిక చేస్తోంది. కానీ, ప్రస్తుత కరోనా సమయంలో అది సవాలుతో కూడుకున్న పనిగా భావిస్తున్నారు నేతలు. దుర్గ పూజ సందర్భంగా పంచమి నుంచి అష్టమి సమయంలో అమిత్ షా బంగాల్ పర్యటన ఉండనుంది."