దిల్లీ హింసాత్మక ఘటనలతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. రైతుల ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో తాజా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఉన్నతస్థాయి అధికారులు సమావేశమైనట్టు సమాచారం. సరిహద్దులతో పాటు.. పలు ప్రదేశాల్లో చోటు చేసుకున్న ఘర్షణలపై అమిత్ షాకు అధికారులు వివరించినట్టు తెలుస్తోంది. అనుమతులిచ్చిన మార్గాలను వీడి.. రైతులు ఎర్రకోటకు చేరుకోవడం వంటి అంశాలపై అధికారులతో షా చర్చించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసు బలగాలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన వేళ.. దిల్లీలోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. భద్రత కోసం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. నిబంధనలను పక్కనపెట్టి.. అనుమతులిచ్చిన మార్గాన్ని వీడి ఎర్రకోటవైపు దూసుకెళ్లారు. ఎర్రకోటపై ఓ మతానికి సంబంధించిన జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో దిల్లీవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఆంక్షల వలయంలో దిల్లీ..
ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తతల కారణంగా దేశ రాజధాని దిల్లీ ఆంక్షల వలయంలోకి జారుకుంది. పార్లమెంటు, విజయ్ చౌక్, రాజ్‌పథ్, ఇండియా గేట్ వైపు వచ్చే అన్ని రహదారులు మూసివేశారు పోలీసులు. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. పర్యటకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:-నిరసనకారుల నుంచి పోలీసును కాపాడిన రైతులు