తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వాయు': సహాయక చర్యలకు షా ఆదేశాలు - ఎన్డీఆర్ఎఫ్

గుజరాత్​ వైపుగా తరుముకొస్తున్న 'వాయు' తుపానుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. తుపాను విధ్వంసం నుంచి ప్రజలను రక్షించేందుకు సాధ్యమైన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అమిత్​ షా

By

Published : Jun 11, 2019, 7:26 PM IST

గుజరాత్​పై 'వాయు' తుపాను ప్రభావం దృష్ట్యా ముందస్తు సహాయక చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను తీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశారు.

"తుపాను వీడిన తర్వాత విద్యుత్​, టెలికాం, ఆరోగ్యం, తాగునీరు తదితర వ్యవస్థలను వేగంగా పునరుద్ధరించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలి. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 24 గంటలు కంట్రోల్​ రూంలు పనిచేయాలి."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

ముందస్తు సహాయక చర్యల కోసం ఇప్పటికే 26 జాతీయ విపత్తు స్పందన దళాలను గుజరాత్​కు పంపించారు. ఒక్కో బృందంలో 45 మంది సిబ్బంది ఉంటారు. వీరితో పాటు పడవలు, ట్రీ కట్టర్స్, టెలికాం పరికరాలను తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో మరో 10 బృందాలను పంపించాలని ఎన్డీఆర్​ఎఫ్​ నిర్ణయించింది.

గుజరాత్​తో పాటు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, దమన్​ దీవ్​లపైనా తుపాను ప్రభావం ఉండనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్​లోని పోరుబందర్, మహువా మధ్య గురువారం ఉదయం తీరం దాటనుందని వెల్లడించింది. గంటకు సుమారు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. ఈ రాష్ట్రాలతో ముందుజాగ్రత్తగా హోంశాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.

ఇదీ చూడండి: 'వాయు' వేగంతో దూసుకొస్తోన్న తీవ్ర తుపాను

ABOUT THE AUTHOR

...view details