పౌరచట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విపక్షాలే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పౌరచట్టంపై పోరాడేవారు పొరుగుదేశాల నుంచి ఆశ్రయం కోరుతూ వచ్చిన ఎస్సీ వర్గాలకు వ్యతిరేకులని పేర్కొన్నారు.
చట్ట సవరణకు అనుకూల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని హుబ్బళ్లిలో చేపట్టిన బహిరంగసభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు షా. సీఏఏ ఏ విధంగా ముస్లింలకు వ్యతిరేకమో రుజువు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు ముస్లిం సోదరుల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
"పౌరచట్టాన్ని వ్యతిరేకించేవారిని ప్రశ్నిస్తున్నా. పొరుగు దేశాల నుంచి వచ్చిన ఎస్సీ వర్గ సోదరులను వ్యతిరేకించి మీరు ఏం సాధిస్తారు. పౌరచట్టంపై పోరాడేవారు ఎస్సీ వ్యతిరేకులు. ఎన్నికల సమయంలో ఈ దేశంలోని ఎస్సీలు బౌద్ధ విగ్రహాలను కూల్చినవారి లెక్క అడుగుతారు. మీరు ఎవరిని సమర్థిస్తారు."