ఎన్డీఏ నేతల ఇఫ్తార్ విందులపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ఆగ్రహించారు. వివాదస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మందలించారు. ఎన్డీఏ నేతలు నితీశ్ కుమార్, రామ్ విలాస్ పాసవాన్ ఇఫ్తార్ విందులో పాల్గొంటున్న చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు గిరిరాజ్.
'ఇంతే ఆసక్తితో నవరాత్రి ఉత్సవాల్లో ఫలహారం స్వీకరిస్తే ఎంత చక్కటి చిత్రాలు వస్తాయి... మన ధర్మాలను పాటించేందుకు విముఖత వ్యక్తం చేసి, ఇతరులకు కనిపించటానికి ఎందుకు ముందుంటాం' అని తన ట్వీట్లో ప్రశ్నించారు.
బిహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వంలో పనిచేసినప్పటి నుంచి ఆయనను వ్యతిరేకిస్తూ వస్తున్నారు గిరిరాజ్. తాను పోస్ట్ చేసిన నాలుగు ఫోటోల్లోనూ నితీశ్ ఉండటం చర్చనీయాంశంగా మారింది. గిరిరాజ్ పోస్ట్ చేసిన చిత్రాల్లో భాజపా నేత, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ సైతం కనిపిస్తున్నారు.