అభిశంసన గ్రహణం వీడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి చేపట్టనున్న భారత్ పర్యటనకు పూర్వరంగం వడివడిగా సిద్ధమవుతోంది. ఈ నెల చివరి వారంలో ఇండియాలో అడుగిడనున్న ట్రంప్ పర్యటన సందర్భంగా- కొంతకాలంగా తీవ్ర ఒడుదొడుకులకు లోనైన అమెరికా భారత్‌ల ద్వైపాక్షిక వాణిజ్యం తిరిగి గాడిన పడేలా ప్రభావశీల ఒప్పందం కుదరనుందన్న సంకేతాలు వినవస్తున్నాయి.
భౌగోళిక రాజకీయాల్లో ఇండియా క్రియాశీల భూమికను గట్టిగా సమర్థిస్తున్న ట్రంప్ సర్కారు, వాణిజ్యాంశాల విషయానికి వచ్చేసరికి 'అమెరికాకే ప్రాధాన్యం' అంటూ భారీ సుంకాల వడ్డనకు తెరతీయడం తెలిసిందే. అందుకు దీటుగా ఇండియా సైతం స్పందించడంతో వాణిజ్య స్పర్ధ శ్రుతి మించి పాకానపడటం- ఉభయ దేశాలకూ మింగుడు పడనిదే. ఈ నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం కోరినట్లుగా వాణిజ్య రాయితీలకు తల ఊపితే దేశీయంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ కుదేలైపోతాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాషింగ్టన్ కోరుతున్నట్లు సుంకాలు, సుంకేతర ప్రతిబంధకాల్ని తొలగించి వారి మొక్కజొన్న, పత్తి, సోయా, గోధుమ, ఎండుఫలాల (నట్స్) ఉత్పాదనలకు దేశీయ మార్కెట్ల తలుపులు బార్లా తెరిస్తే- కోరి కొరివితో తలగోక్కున్నట్లే అవుతుందని రైతు సంఘాలు మొత్తుకొంటున్నాయి. ఒకటో రెండో గేదెలు, ఆవుల్ని పెట్టుకొని పాల వ్యాపారంతో బతుకులీడ్చే 15 కోట్లమంది పాడి రైతులున్న ఇండియా- భారీ సబ్సిడీల దన్నుతో ఎదిగిన అమెరికా పాడి ఉత్పాదనల ధాటి, పోటీకి తట్టుకొని నిలవగలదా- అన్న ప్రశ్న పూర్తిగా సమంజసమైనది.
కచ్చితత్వంతో వ్యవహరించాలి
అమెరికా పత్తి వచ్చిపడితే స్థానికంగా రైతుల బతుకులు దూదిపింజెలు అవుతాయన్న సందేహాలు, జన్యు పరివర్తిత ఉత్పాదనలు దిగుమతి అయితే జీవ భద్రత పరిస్థితేమిటన్న ఆందోళనలు ముమ్మరిస్తున్నాయి. నిరుడు నవంబరులో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్) వేదికపై భారత్ గళాన్ని బలంగా వినిపించి దేశీయ రైతుల ప్రయోజనాల్ని కాచుకొన్న మోదీ ప్రభుత్వం- అమెరికాతో ఒప్పందం విషయంలోనూ అదే కచ్చితత్వంతో వ్యవహరించాలన్నదే అందరి ఆకాంక్ష!
తాత్కాలిక ఒప్పందాల కోసం ట్రంప్!
'వాణిజ్య యుద్ధాలు మంచివే... సులభంగా గెలవచ్చు'నంటూ దిగుమతి సుంకాల పెంపు ద్వారా చైనా, ఇండియాలతో కయ్యానికి కాలుదువ్విన ట్రంప్- తద్వారా అమెరికా వాణిజ్య లోటును కట్టడి చెయ్యదలిచారు. బీజింగ్, దిల్లీలు సైతం అమెరికా ఉత్పాదనలపై సుంకాలు పెంచేసరికి, దేశీయంగా సెగపెరిగి అమెరికా రైతులే దిక్కుతోచని స్థితిలో పడిపోవడంతో- తాత్కాలిక ఒప్పందాలతో గండం గడిచి గట్టెక్కడానికి ట్రంప్ తాపత్రయపడుతున్నారు! 'ఎన్నో ఏళ్లుగా అమెరికాపై ఇండియా అత్యధిక వాణిజ్య సుంకాలు విధిస్తోంది. అది సుంకాల రాజుగా మారింది' అని ట్రంప్ సర్కారు ఆక్షేపిస్తున్నా 'వాణిజ్య పరిమాణ సగటు' ప్రాతిపదికన భారత్ విధిస్తున్న సుంకాలు పెద్ద ఎక్కువేమీ కాదని మోదీ ప్రభుత్వం చెబుతోంది.