అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్ రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. నిన్నటి వరకు ఎవరి క్యాంపులు వారివే.. ఎవరి వ్యూహాలు వారివే అన్నట్లు సైలెంట్‌గా ఉన్న రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఆయన సోమవారం భేటీ అయ్యారు.
సచిన్ పైలట్ సహా 18 మంది ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. పార్టీపై తిరుగుబాటు ప్రకటించిన నాటి నుంచి సచిన్ పైలట్‌ను వెనక్కి రప్పించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. అయినా సచిన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే, ఆగస్టు 14న అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సచిన్ పైలట్ మనసు మార్చుకుని పార్టీలోకి పునరాగమనం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాహుల్, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు పైలట్. రాహుల్‌తో భేటీ విషయంలో ఇద్దరు పార్టీ సీనియర్ నేతలు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.
అటు పైలట్ వర్గం సైతం ఇదే తరహా ప్రకటన చేసింది. అధిష్ఠానం తమతో సంప్రదింపులు జరుపుతోందని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని వెల్లడించింది.