అసెంబ్లీ ఎన్నికల ముందు బంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే.. పలువురు కీలక నేతలు పార్టీకి స్వస్తి పలికారు. వారంతా భాజపాలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి కోల్‌కతా వెళ్లనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున రాష్ట్ర వ్యవహారాలపై సమీక్షించేందుకే షా వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా.. చేరికలే ప్రధాన లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీఎంసీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి.. అమిత్ షా పర్యటన సందర్భంగానే కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ఆయనతో పాటు శిలభద్ర దత్తా, జితేంద్ర తివారీ వంటి కొంత మంది ఎమ్మెల్యేలు, అసంతృప్త టీఎంసీ నాయకులూ కమలదళంలో చేరతారని సమాచారం.
షా పర్యటన సాగనుందిలా..
- శుక్రవారం రాత్రి కోల్‌కతాకు చేరుకుని న్యూటౌన్‌లోని హోటల్లో బస చేస్తారు.
- శనివారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులతో సమావేశం అవుతారు షా. ఆ తర్వాత ఉత్తర కోల్‌కతాలోని స్వామి వివేకానంద నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పిస్తారు.
- అనంతరం మిద్నాపోర్కు వెళ్లి ఖుదిరామ్ బోస్‌కు నివాళులర్పిస్తారు. రెండు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లి మధ్యాహ్న భోజనం చేస్తారు. తర్వాత మిద్నాపోర్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు హాజరవుతారు. ఈ ర్యాలీలోనే పలువురు టీఎంసీ నేతలు పార్టీలో చేరే అవకాశం ఉంది.
- బహిరంగ సభ నుంచి కోల్‌కతాకు చేరుకుని రాష్ట్ర నాయకులతో పార్టీ వ్యవహారాలపై చర్చిస్తారు.
- ఆదివారం శాంతి నికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం బౌల్ సింగర్ ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తారు. బోల్పుర్ రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి దిల్లీ వెళ్తారు.