తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఒకే దేశం ఒకే ఎన్నిక' పై భిన్న స్వరాలు

జమిలి ఎన్నికల ప్రక్రియ అమలు చేయాలంటే కేంద్రానికి విపక్ష పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కీలక అంశాలపై ఏకాభిప్రాయం కోసం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన అఖిల పక్ష భేటీ నిర్వహించారు. సమావేశంలో జమిలిపై మెజారిటీ పార్టీలు అంగీకరించినా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్టు సమాచారం.

అఖిల పక్ష భేటీ

By

Published : Jun 20, 2019, 5:49 AM IST

Updated : Jun 20, 2019, 6:40 AM IST

జమిలిపై ముందుకు పోతున్న కేంద్రం

కీలక అంశాలపై అన్ని పార్టీల ఏకాభిప్రాయం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన అఖిల పక్ష భేటీని బుధవారం నిర్వహించారు. జమిలి ఎన్నికలు, 75వ స్వాతంత్ర్య వేడుకలు, మహాత్మాగాంధీ 150వ జయంతి వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. మెజారిటీ పార్టీలు జమిలి ఎన్నికలకు అంగీకారం తెలిపాయని కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. జమిలి ఎన్నికలపై పరిశీలన కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రధాన విపక్షాలు దూరం

అఖిల పక్ష భేటీకి 40 పార్టీలను ఆహ్వానించగా 21 పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. మరో 3 పార్టీలు లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు తెలిపాయి. సీపీఎం, సీపీఐ, జేడీయూ, శిరోమణి, బీజేడీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, పీడీపీ, నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీల అధినేతలు హజరయ్యారు. కాంగ్రెస్, తృణమూల్​, బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే, తెదేపా, ఆమ్​ ఆద్మీతో పాటు శివసేన కూడా సమావేశానికి రాలేదు.

ఈ సమావేశంలో జమిలితో భాజపా విపక్షాలకు ఉచ్చు బిగిస్తోందని పలు పార్టీలు ఆరోపించినట్టు సమాచారం. 'ఒకే దేశం - ఒకే ఎన్నిక'పై నిర్ణయం తీసుకునే ముందు సరైన చర్చ అవసరమని పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

అప్రజాస్వామికం: ఏచూరి

మహాత్మాగాంధీ జయంతి, సబ్​కా విశ్వాస్​ వంటి విషయాలపై సానుకూలంగా స్పందించిన సీపీఎం.. జమిలిని వ్యతిరేకించింది. సమావేశం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు.

"1952, 1957లో జమిలిని వ్యతిరేకించాం. అయినా అప్పుడు బలవంతంగా అమలు చేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. సమాఖ్య​ స్ఫూర్తికి విరుద్ధం. 356 అధికరణ ఉండగా జమిలి అసాధ్యం. మా నిర్ణయానికి ఎన్సీపీ నేత శరద్​ పవార్ మద్దతు తెలిపారు. జమిలితో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పవార్​ ఆరోపించారు.​ "

-సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

జమిలి ఎన్నికలు వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.

'మాకు సమ్మతమే'

అయితే కొన్ని పార్టీలు మాత్రం జమిలి ఎన్నికల ప్రక్రియకు మద్దతు తెలిపాయి. బీజేడీ అధినేత నవీన్​ పట్నాయక్​, తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ ఒకేసారి ఎన్నికలపై సానుకూలంగా స్పందించారు. తరచూ ఎన్నికలు జరుగుతుండటం వల్ల దేశాభివృద్ధి కుంటుపడుతోందని నవీన్​ అభిప్రాయపడ్డారు. మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ ప్రవేశికలో 'అహింస' పదాన్ని చేర్చాలని కోరారు.

సహకారంతోనే జమిలి సాధ్యం

ఏకకాల ఎన్నికలపై ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచనతోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ విషయానికి మోదీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిన నేపథ్యంలో విపక్షాల సహకారం అవసరమని కేంద్రం భావిస్తోంది.

భాజపాకు లోక్​సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో సరైన బలం లేదు. ఎగువసభలో ఎన్డీఏ కూటమికి 98 మంది సభ్యులు ఉన్నారు. అయితే రాజ్యాంగ సవరణకు 2/3 వంతు మెజారిటీ.. అంటే 163 మంది సభ్యుల అవసరం ఉంది. పార్లమెంటు ఆమోదించిన తర్వాత 50 శాతం (15) రాష్ట్ర శాసనసభల అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల మద్దతును కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

జమిలితో ప్రజాధనం వృథా కాకుండా చేయగలమని గతేడాది ఆగస్టులో న్యాయశాఖ కమిషన్​ తెలిపింది. అయితే ప్రస్తుత రాజ్యాంగంలోని నిబంధనలతో జమిలి ఎన్నికలను అమలు చేయలేమని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'కమిటీ ద్వారా ముందుకు' - జమిలిపై కేంద్రం

Last Updated : Jun 20, 2019, 6:40 AM IST

ABOUT THE AUTHOR

...view details