కరోనా మహమ్మారితో కూలీలంతా స్వరాష్ట్రాలకు తరలివెళ్లారు. ఆయా రాష్ట్రాల్లో కార్మికుల కొరత ఏర్పడింది. కార్మికులు లేక పలు పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ భవన నిర్మాణ సంస్థ బంగాల్ నుంచి ఐదుగురు కార్మికులను ఆకాశమార్గాన తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి సుమారు రూ.7,500 విలువైన విమాన టికెట్లు కొనుగోలు చేశారు బిల్డర్లు.
ప్రస్తుతం కర్ణాటకలో కూలీల కొరత ఏర్పడింది. దాంతో బంగాల్ నుంచి నైపుణ్య ఉన్న కార్మికులను తీసుకురావాలని బిల్డర్లు నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఓ సమస్య ఎదురైంది. ప్రస్తుతం అంతర్రాష్ట్రాల మధ్య రైలు సేవలు లేవు. రోడ్డు మార్గం ద్వారా రావాలంటే నాలుగు రాష్ట్రాల అనుమతులు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఐదుగురిని విమానంలో తీసుకురావాలని నిశ్చయించుకుని.. వారికి టికెట్లు వేశారు.