తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య తాజా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్ సరస్సు వద్ద సెగలు రగులుతూనే ఉన్నాయి. గత నెల 29 అర్ధరాత్రి ఈ సరస్సు దక్షిణ తీరాన్ని చేజిక్కించుకునేందుకు డ్రాగన్ విఫలయత్నం చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో మన సైన్యం తన వ్యూహాన్ని సమూలంగా మార్చేసింది.
లద్దాఖ్‌లోని 1597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద ‘సరిహద్దు నిర్వహణ’ మాత్రమే చేపట్టే భారత్.. ఇప్పుడు ‘సరిహద్దు రక్షణ’కు పూనుకుంది. ఇందుకు అనుగుణంగా సైన్యంలోని వివిధ విభాగాలతో మిశ్రమ దళాలను అక్కడ మోహరించింది. కొన్నిచోట్ల బలగాల స్థానాల్లో మార్పులు చేర్పులు చేపట్టింది. చైనా ఎలాంటి దుస్సాహసానికి దిగినా సరిహద్దును కాపాడుకునేలా పటిష్ఠంగా వ్యూహాన్ని సిద్ధం చేసింది. చైనా దూకుడు చర్యలను పరిగణనలోకి తీసుకొని, ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని ప్రదేశాలనూ కాపాడుకునేలా దీన్ని రూపొందించామని సైనికాధికారులు తెలిపారు.
డ్రాగన్ కన్నా ఎత్తులో మన బలగాలు..
చైనా ఎత్తును చిత్తు చేసేందుకు పాంగాంగ్ సరస్సు దక్షిణ రేవు భాగంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను తన స్వాధీనంలోకి తెచ్చుకున్న భారత్.. అదే పట్టును కొనసాగిస్తోంది. ఉత్తర తీరంలోని కీలకమైన ఫింగర్-4 పర్వతాలు చైనా కబ్జాలో ఉన్నాయి. అయితే ఆ ఫింగర్ ప్రాంతంలోనూ ఇతర పర్వత శిఖరాలను ఆకస్మికంగా తన అధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా డ్రాగన్‌పై భారత్ ఒత్తిడి పెంచింది. తద్వారా భవిష్యత్‌లో చర్చలు జరిపేటప్పుడు భారత్‌కు అనుకూల పరిస్థితి ఉంటుందని సైనిక వర్గాలు తెలిపాయి. ఫింగర్-4 ప్రాంతంలో తిష్టవేసిన డ్రాగన్ అక్కడి నుంచి వైదొలగడానికి నిరాకరిస్తోంది.
సరికొత్త వ్యూహం
తూర్పు లద్దాఖ్‌లోకి చైనా ఇబ్బడిముబ్బడిగా బలగాలను తరలిస్తున్న నేపథ్యంలో భారత్ దీటుగా స్పందిస్తోంది. 1962లో చైనాతో యుద్ధం తర్వాత ఆ దేశ జోరును కట్టడి చేయడానికి ప్రత్యేకంగా సిద్ధంచేసిన ‘స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్’ సహా అనేక విభాగాలను రంగంలోకి దించింది. దెప్సాంగ్ మైదాన ప్రాంతాల్లో చైనా యాంత్రిక పదాతిదళ బ్రిగేడ్‌ను మోహరించిన నేపథ్యంలో మన దేశం సాయుధ ట్యాంకు దళం, యాంత్రిక పదాతి దళాలతో కూడిన పటిష్ఠ పోరాట విభాగాన్ని రంగంలోకి దించింది.
చుమార్ ప్రాంతంలోనూ ఇలాంటి దళాన్ని భారత్ మోహరించింది. తద్వారా సరిహద్దులను పటిష్ఠంగా రక్షించుకునేందుకు సిద్ధమన్న సంకేతాన్ని డ్రాగన్‌కు ఇచ్చింది. ఇప్పుడు దెమ్‌చోక్, చుమార్ ప్రాంతంలో భారత్‌దే పైచేయిగా ఉంది. చైనాకు చెందిన లాసా-కష్గర్ హైవేపై ఆ దేశం సాగిస్తున్న సైనిక తరలింపులను ఎత్తయిన ప్రాంతాల నుంచి స్పష్టంగా మన సైనికులు చూడగలుగుతున్నారు.
సైన్యాధిపతి పర్యటన
తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె రెండు రోజుల పర్యటన కోసం లద్దాఖ్ చేరుకున్నారు. సరిహద్దు శిబిరాన్ని సందర్శించి బలగాలతో ముచ్చటించారు.
క్షేత్రస్థాయిలోని పరిస్థితులను సైనిక కమాండర్లు ఆయనకు వివరించారు. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్.భదౌరియా తూర్పు విభాగంలోని పలు కీలక వైమానిక స్థావరాలను బుధవారం సందర్శించారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని ఎల్‌ఏసీ వెంబడి వాయుసేన పోరాట సన్నద్ధతపై సమీక్ష జరిపారు. మన వాయు సేన ఇప్పటికే తనవద్ద ఉన్న సుఖోయ్-30 ఎంకేఐ, జాగ్వార్, మిరాజ్-2000 తదితర అగ్రశ్రేణి యుద్ధవిమానాలు, అపాచీ, చినూక్ వంటి హెలికాప్టర్లను మోహరించింది.