తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ-జిన్​పింగ్​ స్థాయి చర్చలతోనే ఫలితాలు! - Frutiless talks

భారత్​-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతూ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితుల్లో.. వాస్తవాధీన రేఖ వెంట చర్చల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్​పై వాతావరణ పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉండే అక్టోబర్​లో చైనా మరింత ఒత్తిడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సైనికాధికారుల చర్చలు ప్రతిసారీ సరైన పరిష్కారం లేకుండానే ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ల మధ్య భేటీ జరిగితేనే ఓ ఘర్షణలకు తెరపడే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు.

Amid fruitless talks, only Modi-Xi-level meet can avert LAC conflict
మోదీ-జిన్​పింగ్​ స్థాయి చర్చలతోనే ఫలితాలు!

By

Published : Sep 22, 2020, 9:33 PM IST

Updated : Sep 22, 2020, 9:46 PM IST

భారత్​-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని నెలలుగా విడతల వారీగా కమాండర్​ స్థాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఉద్రిక్తతలు తగ్గించేందుకు సోమవారం మాల్డో-చుషుల్​ పోస్టులో ఏకబిగిన 14గంటల పాటు సమావేశమయ్యారు. కానీ, చర్చల ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు.

తాజా చర్చల్లోనూ చైనా అదే ధోరణితో వ్యవహరిస్తోంది. బలగాల ఉపసంహరణకు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్​ నుంచి కదలనంటూ మొండికేస్తుంది. ఉత్తర పాంగాంగ్​ సరస్సు, దెప్​సాంగ్​, హాట్ స్ప్రింగ్​ ప్రాంతాల నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకునేదేలేదని స్పష్టం చేస్తోంది. పైగా భారత్​ పట్టు సాధించిన దక్షిణ భాగంలోని కీలక ప్రాంతాల నుంచి భారత సైన్యం వెనక్కి వెళ్లాలని అడుగుతోంది. భారత అధికారులు ఇందుకు సిద్ధంగా లేరు.

ఈ నేపథ్యంలో చర్చలు ఫలప్రదం కాకపోయినా పక్షం రోజుల్లో మరోసారి భేటీ అయ్యేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. అయితే ఈ తరహా సమావేశాలు ఏప్రిల్-మేలలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి.

మోదీ-జిన్​పింగ్​ మధ్య చర్చలు!

ఇరు పక్షాల మధ్య గంటల తరబడి చర్చలు జరుగుతున్నా ఎటువంటి ప్రయోజనాలు కనిపించటం లేదు. బలగాల ఉపసంహరణకు సరైన ఒప్పందం కుదరటం లేదు. ఈ నేపథ్యంలో రెండు దేశాల అధినేతల మధ్య చర్చలే వివాదాలకు పరిష్కారం చూపుతాయని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ ఇద్దరూ జాతీయవాద నేతలే. ప్రజల్లో ఆదరణ కలిగిఉన్న నేతలు. ఈ పరిస్థితుల్లో సరిహద్దులో శాంతి నెలకొనాలంటే ఇరువురు నేతలూ సమావేశమవ్వాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. లేదంటే వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు మరింత దిగజారి, భారత్​-చైనా బలగాలు అక్టోబర్​ నాటికి అన్ని బహిరంగ ఘర్షణలకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శాంతి ఒప్పందాలు, బలగాల ఉపసంహరణ చర్చలకు ప్రాధ్యానతే లేకుండా పోయింది.

అక్టోబర్​లోనే ఎందుకు?

భారత్​-చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖ వద్ద నవంబర్​ నాటికి వాతావరణ పరిస్థితులు భీకరంగా మారుతాయి. విపరీతమైన చలి, భారీ మంచు, కనిష్ఠానికి పడిపోయే ఉష్ణోగ్రతలకు తోడు హిమాలయాల్లో చలిగాలులు వెరసి యుద్ధం సంగతి అటుంచితే.. మనిషి బతకటమే కష్టమైపోతుంది. మరోవైపు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్న యుద్ధ పరికరాలు, బలగాలను ఆ వాతావరణలో హిమలయాలమీద సమరానికి సిద్ధం చేయటం రెండు దేశాలకు ఆర్థికంగా పెను భారంగా మారుతుంది.

భారత ఆర్థిక వ్యవస్థ కొవిడ్​-19 కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. దేశం ఆర్థికంగా కోలుకోవటానికి అక్టోబర్​-జనవరి ఈ నాలుగే నెలలే సరైన సమయం. చేతికొచ్చే రబీ పంట, పండగలు, పెళ్లిళ్ల సీజన్​ వల్ల వస్తువినియోగం పెరుగుతుంది. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కడానికి కొంత అవకాశముంటుంది. డ్రాగన్​ దేశం సైతం ఇదే అదునుగా వ్యూహత్మకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. భారత్​కు ఆర్థికంగా కోలుకునే అవకాశమివ్వకుండా.. ఎల్​ఏసీ వద్ద మరిన్ని ఉద్రిక్తతలతో దిల్లీ నాయకత్వానికి తలనొప్పులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సరిహద్దులో మోహరించిన 40వేల మంది సైనికులు, ట్యాంకులు, శతఘ్నులు, సైనిక పరికరాలతో ఇప్పటికే ఇరుదేశాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.

వివిధ స్థాయిల్లో చర్చలు..

సెప్టెంబర్​ 4న మాస్కో వేదికగా రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీతో భేటీ అయ్యారు. మరోవైపు సెప్టెంబర్​ 10న ఇరుదేశాల విదేశాంగ శాఖ మంత్రులు జై శంకర్​, వాంగ్​ యీ సమావేశమయ్యారు. భారత ప్రత్యేక ప్రతినిధిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​..​ చైనా ప్రతినిధితో జులై 6నే చర్చలు జరిపారు.

మరోవైపు సైనికాధికారుల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కమాండర్​ స్థాయి భేటీలు జరిగాయి. చుషుల్-మాల్డో వేదికలుగా జూన్​ 5, జూన్​ 22, జులై 14, ఆగస్టు 2తో పాటు తాజాగా సోమవారం జరిగిన చర్చలతో ఆరవ భేటీ ముగిసింది. అయితే, ఈ సమావేశాల్లో భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నవీన్​ శ్రీవాస్తవ సైతం పాల్గొన్నారు. ఇక సైనికాధికారుల నుంచి లెఫ్టినెంట్​ జనరల్​ హరీందర్​ సింగ్​ పాల్గొనగా అక్టోబర్​లో జరిగే భేటీలో లెఫ్టినెంట్​ జనరల్​ పీజీకే మేనన్​ పాల్గొననున్నారు.

సంయుక్త ప్రకటన

సోమవారం జరిగిన చర్చల్లో ప్రధానంగా.. సెప్టెంబర్​ 10న ఇరుదేశాలు అంగీకారానికి వచ్చి సంయుక్తంగా ప్రకటించిన పంచసూత్ర ఒప్పందంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ సంయుక్త ప్రకటనలో మొదటి అంశం గతంలో ఇరుదేశాధినేతల మధ్యా.. 2018 వుహాన్​లో, అలాగే 2019 మామళ్లపురంలో జరిగిన అనధికారిక పర్యటనల్లో కుదిరిన ఒప్పందాల గురించే ఉంది. సరిహద్దు అంశాలపై ఏకాభిప్రాయమే ప్రధాన అజెండాగా ఈ ఒప్పందాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోదీ-జిన్​పింగ్​ భేటీ సందర్భంగా కుదిరిన ఒప్పందాల అంశాలను ఉటంకిస్తున్నారు. అందువల్ల ఇరువురు నేతల స్థాయిలో భేటీ జరిగితేనే సరిహద్దు వివాదాలకు చెక్​ పడే అవకాశముంది.

భారత్​-చైనా సరిహద్దు వివాదాల్లో ప్రధాన సమస్య ఇదే. దేశాధినేతల స్థాయిలో చర్చలు జరిగితేనే తప్ప.. ఫలితాలు వచ్చే సూచనలు కనిపించవు. దశాబ్దాల నుంచి పీడిస్తున్న సమస్యలు అవటం వల్ల.. సైనిక స్థాయి చర్చలు, దౌత్యాధికారుల స్థాయి భేటీలు పరిష్కరం చూపించలేవు.

చారిత్రక సమీకరణాలు..

ఓవైపు భారత్​-చైనాల మధ్య చర్చలు జరుగుతుండగానే.. భారీ ఎత్తున సైన్యం మోహరింపులు జరుగుతున్నాయి. బలగాలు, సైనిక సంపత్తిని హిమాలయాల్లోకి చేరుస్తూనే ఉన్నాయి ఇరు దేశాలు. ప్రస్తుతం దాదాపు లక్ష మంది సైనికులు వాస్తవాధీన రేఖకు ఇరువైపులా యుద్ధ సన్నద్ధతతో సిద్ధంగా ఉన్నారు. ఈ సన్నద్ధత ఆ ప్రాంతాల్లోకి పరికరాలు తరలించటానికి అనుకూలంగా మౌలిక సదుపాయాలను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా కూడా ఎల్​ఏసీ వెంబడి భారీగా బలగాలను మోహరిస్తుండటంతో ఇప్పటివరకూ పాక్​పై దృష్టి సారించిన సైన్యం.. చైనా లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

(రచయిత-సంజీవ్ బారువా)

Last Updated : Sep 22, 2020, 9:46 PM IST

ABOUT THE AUTHOR

...view details