'మహా' ప్రతిష్టంభన: నేడు దిల్లీకి పవార్, ఫడణవీస్ మహారాష్ట్రకు సంబంధించిన అగ్ర నేతలు శరద్ పవార్, దేవేంద్ర ఫడణవీస్ నేడు దిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న వేళ.. ఇరువురు అగ్రనేతల దిల్లీ పయనంతో రాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 105 సీట్లు సాధించి భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56 సీట్లు గెలుపొందింది. పొత్తుతో బరిలోకి దిగి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్పష్టమైన మెజారిటీని భాజపా-శివసేన సాధించాయి. అయితే అధికారం చెరిసగం అని శివసేన పట్టుపట్టడం... భాజపా తిరస్కరించడం వల్ల ప్రభత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది.
షాతో ఫడణవీస్ భేటీ...
ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో... ఫడణవీస్ భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితికి ఈ భేటీతో తెరపడుతుందని అందరూ ఆశిస్తున్నారు. అయితే భాజపా వర్గాలు మాత్రం... అకాల వర్షాలకు రాష్ట్రంలో పంటలు కోల్పోయిన రైతులకు జాతీయ విపత్తు పరిహారంపై చర్చించడానికే అమిత్ షాను ఫడణవీస్ కలవనున్నట్లు తెలిపాయి.
సోనియాతో పవార్ భేటీ...
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేడు భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో భాజపా- శివసేనల మధ్య నెలకొన్న అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో.. వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. భాజపాను అధికారానికి దూరంగా ఉంచే క్రమంలో, శివసేనకు మద్దతిచ్చే అంశంపై వీరు చర్చించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుత మహారాష్ట్ర శాసనసభ గడువు ఈ నెల 9తో ముగియనుంది. ఈ లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భాజపా ప్రయత్నాలు చేస్తోంది.