తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దు ఉద్రిక్తతల మధ్య భారత కమాండర్ల భేటీ

భారత ఉత్తర సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగుతున్న తరుణంలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ బుధవారం ప్రారంభం కానుంది. పరిపాలనా సమస్యలు, లాజిస్టిక్స్, మానవ వనరుల సమస్యలే సమావేశాల ప్రధాన అజెండాగా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ... సరిహద్దులో ఘర్షణ వాతావరణంపై చర్చించే అవకాశం లేకపోలేదు.

Army Commanders Conference
ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్

By

Published : May 26, 2020, 5:21 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోన్న సమయంలో చైనా మాత్రం భారత్​కు ఉత్తర సరిహద్దు వద్ద ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తోంది. రెండు దేశాలూ దూకుడైన వ్యూహాన్నే అనుసరిస్తున్నాయి. పెద్ద ఎత్తున బలగాలను వాస్తవాధీన రేఖ వెంబడి మోహరిస్తున్నాయి.

ఇదీ చదవండి:చైనాకు దీటుగా భారత బలగాల మోహరింపు!

ఈ నేపథ్యంలోనే ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ​(ఏసీసీ) ద్వైవార్షిక సమావేశం బుధవారం ప్రారంభం కానుంది. దేశ రాజధానిలో మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి కీలక ఆర్మీ కమాండర్లు హాజరు కానున్నారు.

రెండు సంవత్సరాలకు ఒకసారి వారం రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను.. సాధారణంగా మార్చి-ఏప్రిల్, అక్టోబర్ నెలలో నిర్వహిస్తారు. కానీ, దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలను వాయిదా వేశారు. తొలిసారిగా ఈ సమావేశాలను రెండు దఫాలుగా విభజించారు. రెండో దఫా సమావేశాల తేదీలను నిర్ణయించనప్పటికీ జూన్​ చివరి వారంలో నిర్వహిస్తారని సమాచారం.

వేదిక మార్పు

సాధారణంగా ఏసీసీ సమావేశం మనేక్షా సెంటర్​లో జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం సమావేశాన్ని రక్షణ శాఖ కార్యాలయం ఉన్న సౌత్​ బ్లాక్​లో నిర్వహించనున్నారు. వ్యక్తిగత దూరం వంటి నిబంధనలు పాటిస్తూనే సమావేశం నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

సరిహద్దుపై చర్చించరా?

'పరిపాలన సమస్యలు, లాజిస్టిక్స్, మానవ వనరుల నిర్వహణ అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశాలు జరగనున్నాయి' అని ఆర్మీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సమావేశంలో సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చించే అవకాశాన్ని ఖండిస్తున్నారు. అయితే, ఓవైపు సరిహద్దులో ఘర్ణణ వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించకపోవడం అసమంజసమే.

రెండు వైపులా అదే పరిస్థితి!

ఓవైపు పాకిస్థాన్​తో ఉన్న సరిహద్దు వెంబడి నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘన జరుగుతూనే ఉంది. మరోవైపు చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ వద్ద కొత్త ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. దీంతో రెండు సరిహద్దులు కూడా సైనిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారాయి.

ఇదీ చదవండి:భారత్​, చైనా సరిహద్దు వివాదం- 10 కీలకాంశాలు

ఏంటీ సమావేశాలు?

భారత ఆర్మీ కార్యకలాపాలకు సంబంధించి ప్రణాళికా రచన నుంచి అమలు చేసే విధానాలు రూపొందించడంలో ఏసీసీ సమావేశాలు ఎంతో కీలకం. లాజిస్టిక్స్, పరిపాలన, మానవ వనరులు, సంక్షేమం వంటి అంశాలపై సమావేశంలో పూర్తి స్థాయి సమీక్షలు నిర్వహిస్తారు.

ఆర్మీ కమాండర్లు, సీనియర్ అధికారులతో ఏర్పాటైన కాలేజియేట్​ వ్యవస్థ ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ఆర్మీ చీఫ్​తో పాటు ప్రభుత్వ రక్షణ రంగ సంస్థల డైరక్టర్లు, ఇతర సైనిక విభాగాలకు చెందిన అధికారులు హాజరవుతారు.

(రచయిత-సంజయ్ బారువా, సీనియర్ జర్నలిస్ట్)

ABOUT THE AUTHOR

...view details