తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సేవను సరిహద్దులు దాటించిన తెలుగు తేజాలు.!

ఉద్యోగం కోసం దేశం సరిహద్దులు దాటారు ఆ యువకులు. మాటపై మమకారంతో ఆర్జేలుగా అలరిస్తున్నారు.‌ అంతటితో ఆగిపోలేదు. ప్రవృత్తి ద్వారానే తాము అందిచాలి అనుకున్న సేవల్ని పరుగులు పెట్టిస్తున్నారు. అమెరికాలో ఉంటూ అవసరం అన్న తెలుగువారికి ఆపన్నహస్తం అందిస్తూ అండగా నిలుస్తున్నారు.

America telugu youth doing services programs as a radio jockey
సేవను సరిహద్దులు దాటించిన తెలుగు తేజాలు.!

By

Published : Oct 10, 2020, 11:33 AM IST

అమెరికాలో ఉద్యోగం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. డాలర్లు పోగేసుకుంటూ సరదాల్ని జుర్రుకుంటారు. ఏమాత్రం ఖాళీ దొరికినా ఎదిగేందుకున్న అవకాశాలు వెతుకుతారు. క్రాంతి, వెంకట్‌రెడ్డి, విలాస్‌రెడ్డిలు వీరందరికన్నా భిన్నం. ఐటీ కొలువులతో పరాయిగడ్డపై అడుగుపెట్టినా తెలుగు మాటపై మమకారం వీడలేదు. ఆర్జేలుగా ఆకట్టుకునే వ్యాఖ్యానంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు శ్రోతలను అలరిస్తున్నారు. పనిలో పనిగా తమ మాటనే మాధ్యమంగా మలిచి ఆపన్నులకు వెల కట్టలేని సాయం చేస్తున్నారు. భావ సారూప్యం ఉన్న ఈ ముగ్గురినీ "http://telugunriradio.com" రేడియో కలిపింది. మామా మహేశ్‌, వెంకట్‌రెడ్డి, విలాస్‌రెడ్డిల ఆధ్వర్యంలోని ఈ ఆన్‌లైన్‌ రేడియోకి అమెరికాలోని ఇల్లినాయిస్‌ కేంద్రం. అయినా వీళ్ల సేవలు ప్రపంచమంతా విస్తరించాయి. తెలుగువాళ్లకి ఎక్కడ, ఏ అవసరం వచ్చినా ఈ ఆర్జేలు స్పందిస్తారు. రేడియోని మాధ్యమంగా ఎంచుకొని ఆపదల్లో ఉన్నవారికి సాయపడతారు. నిజంగా అవసరాల్లో ఉన్నవారెవరో నిర్ధరించుకున్న తర్వాతే చేతల్లోకి దిగుతారు.

తెలుగుకు బాసటగా

విదేశాల్లో స్థిరపడ్డవారు, ముఖ్యంగా యువత క్రమంగా మన సంస్కృతి, సంప్రదాయాలకు దూరమవుతున్నారు.. వీళ్లకు మన ఆచారాలు, వ్యవహారాలు అర్థమయ్యేలా, తెలుగు భాష గొప్పతనం వివరిస్తూ గురు దినోత్సవం, మహిళా దినోత్సవంలాంటి సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువులు, మహిళల గొప్పతనం, వాళ్లకివ్వాల్సిన గౌరవం గురించి వివరిస్తున్నారు.

వలసల వెతలు తీర్చుతూ

అమెరికా అంటే చాలామంది విద్యార్థులు, ఉద్యోగులకు కలల స్వర్గం. పైచదువుల కోసమో, ఉద్యోగం వెతుక్కోవడానికో వేలమంది అక్కడికెళ్తుంటారు. కానీ అక్కడ వలస నిబంధనలు చాలా కఠినం. అవి తెలియక ఇరుక్కుపోతే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. న్యాయవాదుల ఫీజులు చాలా ఎక్కువ. అలాంటి కష్టాల్లో పడకుండా ముందే హెచ్చరిస్తుంటారు. ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవారి అనుభవాలు చెబుతూ, ఎలా బయటపడాలో వివరిస్తారు. ఇమ్మిగ్రేషన్‌ నిపుణులను అతిథులుగా తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు.

రక్తదానం

తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి రక్తం అవసరమైనా ఎన్‌ఆర్‌ఐ రేడియా ఆర్జేలు ముందుంటున్నారు. ప్రోగ్రామ్స్‌ మధ్యలో రక్తదానం అవసరమైన వ్యక్తి వివరాలు చెప్పడమే కాదు.. వ్యక్తిగతంగానూ చొరవ తీసుకొని రక్తదాతలను ఒప్పిస్తున్నారు.

ప్లాస్మా దాతలను ఒప్పిస్తూ

ఈ మధ్యకాలంలో కరోనా ఎంతోమందిని పొట్టనపెట్టుకుంది. ప్లాస్మా దానంతో కొందరైనా ప్రాణాలతో గట్టెక్కారు. ప్లాస్మా దాతల కోసం క్రాంతి, విలాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలు తమవంతు సాయం చేస్తున్నారు. దాతలు, రోగుల మధ్య అనుసంధానకర్తల్లా ఉంటున్నారు.

ఆర్థికంగా ఆదుకుంటూ

అనాథ పిల్లల కోసం, శస్త్రచికిత్సల్లో డబ్బులు అవసరం అయినవారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. తమ కార్యక్రమాల ద్వారా విరాళాలు సేకరించి బాధితులకు అందజేస్తున్నారు.

ఆపదల్లో సమాచారమిస్తూ

తుపాన్లు, భారీ వర్షాలు, భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సైతం జనాన్ని అప్రమత్తం చేస్తున్నారు.

అన్నార్థులకు అండగా

అమెరికా సంపన్న దేశమే అయినా అక్కడ పేదలు తక్కువేం కాదు. అలాంటి అన్నార్థులకు ఆహార పదార్థాలు ప్యాక్‌ చేసి అందిస్తున్నారు. పెద్దమొత్తంలో సేకరించినప్పుడు ఆఫ్రికా దేశాలకు సైతం పంపిస్తున్నారు.

క్రాంతి

పేరు: క్రాంతి (ఫుల్‌నేమ్‌)

సొంతూరు: ఖమ్మం

ఉద్యోగం: క్యాప్‌జెమినీలో ఐటీ ఉద్యోగి

ప్రవృత్తి: తెలుగు ఎన్‌ఆర్‌ఐ రేడియోలో ఆర్జే. గతంలో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఎఫ్‌.ఎం.రెయిన్‌బోలో పని చేశాడు. 'హలో ట్విన్‌ సిటీస్‌' అంటూ జంటనగరాలను పలకరించాడు. ఉద్యోగరీత్యా 2017లో అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ మామా మహేశ్‌ పిలుపుతో శని, ఆదివారాల్లో 'వీకెండ్‌ పార్టీ విత్‌ ఆర్జే క్రాంతి' ప్రోగ్రామ్‌ నిర్వహిస్తున్నాడు. ఐటీ ఉద్యోగం కావడంతో వారాంతాల్లో వచ్చే సెలవులను తన ప్రవృత్తికి, సేవకు మార్గంగా మలచుకున్న క్రాంతి తన కార్యక్రమాల ద్వారా రక్తదానాలు, ప్లాస్మా దానం చేయిస్తున్నాడు. పేద పిల్లల శస్త్రచికిత్సల కోసం విరాళాలు సేకరిస్తున్నాడు.

గార్లపాటి వెంకట్‌రెడ్డి

పేరు: గార్లపాటి వెంకట్‌రెడ్డి

సొంతూరు: నల్గొండ జిల్లా చర్లగూడ

ఉద్యోగం: టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.

ప్రవృత్తి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా 2013లో అమెరికాలో అడుగుపెట్టాడు. మిత్రులతో కలిసి 2017లో తెలుగు ఎన్‌ఆర్‌ఐ రేడియా ప్రారంభించాడు. 'ఇమ్మిగ్రేషన్‌ విత్‌ వెంకట్‌' అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ముఖ్యంగా అక్కడ స్థిరపడ్డ, ప్రవాస తెలుగు సమాజాల్లోని వ్యక్తులకు ఎలాంటి అవసరం వచ్చినా తీర్చడానికి వెంకట్‌రెడ్డి ముందుంటాడు.

విలాస్‌రెడ్డి జంబుల

పేరు: విలాస్‌రెడ్డి జంబుల

సొంతూరు: రంగారెడ్డి జిల్లా మంచాల

ఉద్యోగం: న్యూజెర్సీలో సీవీఆర్‌ఐటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, స్టాటిస్టిక్‌ ప్రోగ్రామర్‌.

ప్రవృత్తి: 2017లో మిత్రులతో కలిసి తెలుగు ఎన్‌ఆర్‌ఐ రేడియా ప్రారంభించాడు. అమెరికాలోని పలు స్వచ్ఛందసంస్థల్లో సభ్యుడు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఆర్జేగా 'ఇమ్మిగ్రేషన్‌ విత్‌ విలాస్‌' చేస్తున్నాడు. ఆగస్టు 15, జనవరి 26 లాంటి జాతీయ దినోత్సవాల్లో ప్రవాస భారతీయులతో కలిసి ర్యాలీలు చేస్తుంటాడు. సొంత డబ్బులతో తన ఊరికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాడు.

ఇదీ చదవండి:బాక్సాఫీస్ విక్రమార్కుడు.. ఈ దర్శక ధీరుడు

ABOUT THE AUTHOR

...view details