'భారత్ మాతా కీ జై', 'జై శ్రీరామ్' నినాదాలతో కొందరికి సమస్యలున్నాయని మహాకూటమి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆటవిక రాజ్యం ఉన్న సమయంలో పేదలు కనీసం ఓటు కూడా వేయలేకపోయరని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోలేకపోయారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నితీశ్ ప్రభుత్వంలో పరిస్థితులు మారిపోయాయని.. రాష్ట్రం అభివృద్ధివైపు పరుగులు తీస్తోందన్నారు.
బిహార్ సహస్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని. భరత మాతను వ్యతిరేకించే వారు ఇప్పుడు ప్రజల ముందుకొచ్చి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.
"బిహర్లో ఆటవిక రాజ్యాన్ని తెచ్చినవారు, వారి సన్నిహితులకు.. మీరు 'భారత్ మాతా కీ జై' అనడం ఇష్టం లేదు. దీని గురించి ఆలోచించండి. మీరు 'జై శ్రీరామ్' అనడాన్ని కూడా వారు ఒప్పుకోరు. వీరికి 'భారత్ మాతా కీ జై' నినాదంతో ఏదో సమస్య ఉంది. ఇలాంటి నినాదాలు చేయొద్దని కొందరు హెచ్చరిస్తారు. ఇలాంటి నినాదాలు చేస్తే మరికొందరికి తలనొప్పి వస్తుంది. భరత మాతకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు ఓట్లు అడగడం కోసం మీ ముందుకువచ్చారు. ఇలాంటి వారికి ఎన్నికల ద్వారా సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది."