తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'పోరు: పైకి పొత్తులు... లోన కత్తులు! - maharastra election latest news

మహారాష్ట్రలో పార్టీల మధ్య పొత్తులు రెండు నాలుకల ధోరణిలో కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ.. చెరో దారి అన్న చందంగా మారింది భాజపా-శివసేన పార్టీల తీరు. అదే దారిలో కాంగ్రెస్​, ఎన్​సీపీలు ఉన్నాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర విధాన సభకు రేపు ఎన్నికలు జరగనున్నాయి.

పైకి పొత్తులు.. లోన కత్తులు

By

Published : Oct 20, 2019, 10:18 AM IST

మహారాష్ట్ర విధానసభకు రేపు (అక్టోబరు 21) ఎన్నికలు జరగనున్నాయి. సభలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. వీటిల్లో కొంకణ్ కోస్తాలోని కంకావ్లీ నియోజకవర్గం అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా బరిలో దిగిన భారతీయ జనతాపార్టీ, శివసేన ఈ స్థానంలో పరస్పరం తలపడుతున్నాయి. పైకి దీన్ని స్నేహితుల మధ్య పోటీగా ఉభయ పార్టీలు వర్ణిస్తున్నా, వాస్తవం వేరుగా ఉంది. ఇక్కడ భాజపా అభ్యర్థిగా ఉన్న నితేశ్ రాణే మాజీ ముఖ్యమంత్రి, శివసైనికుడు నారాయణ్ రాణే కుమారుడు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో నారాయణ్ రాణే వ్యక్తిగతంగా విభేదించి పార్టీ నుంచి బయటికొచ్చేశారు. ఇప్పుడాయన కుమారుడు నితేశ్ కంకావ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. దీనికి ప్రతీకారంగా నారాయణ్ రాణే చిరకాల ప్రత్యర్థి సతీశ్ సావంత్ ను శివసేన తన అభ్యర్థిగా బరిలోకి దించింది. ఈ వైఖరిని నిరసిస్తూ స్థానిక భాజపా నాయకులు పొరుగు నియోజకవర్గాలైన కుడల్ సావంత్ వాడీలలో శివసేన అభ్యర్థులకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులకు తెరచాటు మద్దతు ఇస్తున్నారు. కొంకణ్ ప్రాంతం మొదటినుంచీ శివసేనకు కంచుకోటే. ఈసారి దీన్ని బద్దలుకొట్టాలన్న పట్టుదలతో భాజపా ఉంది. ఈ ప్రాంతంలోని మూడు స్థానాలకు తోడు ఇతర ప్రాంతాల్లోని మరో 22 నియోజకవర్గాల్లోనూ భాజపా, శివసేనలు ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఒకరి అభ్యర్థికి వ్యతిరేకంగా మరొకరు స్వతంత్రులకు మద్దతు ఇస్తుండటం విశేషం.

కలిసీ కలవని వైఖరి

శాసనసభలోని మొత్తం 288 స్థానాలకు చెరి సగం చోట్ల పోటీచేద్దామని శివసేన ప్రతిపాదించినా భాజపా దాన్ని పెడచెవిన పెట్టింది. భాజపా తాను 150 స్థానాల్లో పోటీ చేస్తూ శివసేనకు 124 వదిలింది. రాందాస్ అథవాలేకి చెందిన ఆర్​పీఐతో పాటు కొన్ని చిన్న పార్టీలకు మిగిలిన 14 స్థానాలను కేటాయించింది. 2014కు ముందు మహారాష్ట్రలో భాజపాకు సీనియర్ భాగస్వామిగా ఉన్న శివసేన ఇప్పుడు జూనియర్ భాగస్వామిగా మారిపోయింది. భాజపా ఓ పథకం ప్రకారం తన స్థాయి దిగజార్చాలని చూస్తోందన్నది శివసేన అనుమానం. లోక్​సభ ఎన్నికల నుంచే రెండు పార్టీల మధ్య సంబంధాల్లో అపశ్రుతులు దొర్లాయి. రాష్ట్రంలో భాజపా, శివసేనలు సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నా భాజపా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే.. లోక్​సభ ఎన్నికల్లో విడివిడిగా ప్రచారం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఒకరి పాత్రను మరొకరు గుర్తించనట్లే వ్యవహరించారు. ఇదే ధోరణి ప్రస్తుత విధానసభ ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తోంది. రాష్ట్రంలో భాజపా-శివసేన కూటమి, కాంగ్రెస్-ఎన్​సీపీ కూటమి మధ్య పోరాటం నడుస్తున్న మాట నిజమే. కానీ, తెరవెనక మరో తరహా పోటీ జరుగుతోంది. ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోగలదో తేల్చుకుందామన్న ధోరణిలో భాజపా, శివసేన ముందుకు సాగుతున్నాయి.

భాజపా ఖాతాలో ఎక్కువ స్థానాలు జమపడితే, శివసేన జూనియర్ భాగస్వామిగా మారిపోయి మంత్రివర్గంలో తక్కువ పదవులతో సరిపెట్టుకోవలసి వస్తుంది. ఒకవేళ శివసేనే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే, భాజపా ఎక్కువ పదవులను వదులుకోవలసి వస్తుంది. దీన్ని నివారించడానికే ఆర్​పీఐ వంటి చిన్న పార్టీలతో కలిసి 145కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని భాజపా తాపత్రయ పడుతోంది. 80 నుంచి 100 వరకు గెలుచుకోగలిగితే భాజపా స్కోరును 120కి పరిమితం చేయవచ్చని శివసేన భావిస్తోంది. దాంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు శివసేన సాయం అనివార్యమవుతుంది. ఇలా ముసుగులో గుద్దులాట మాని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఉభయులూ విడివిడిగా పోటీచేసి ఉండవచ్చుకదా అనే ప్రశ్న తలెత్తుతోంది. వివిధ కారణాల వల్ల భాజపాతో తెగతెంపులు చేసుకోలేకపోతున్నామని ఓ శివసేన నాయకుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల ప్రజాదరణ ఉండటం, రాష్ట్రంలో ఫడణవీస్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజాహిత చర్యలు చేపట్టడం, 370వ అధికరణ రద్దుతో మోదీ మరాఠీల మెప్పు పొందడంతో భాజపాకు దూరంగా ఉండలేకపోయామని ఆ నాయకుడు వివరించారు. భాజపా విశ్లేషణ మరోరకంగా ఉంది. రాష్ట్రంలో శివసేన గతంలోకన్నా కాస్త బలహీనపడిన మాట నిజమే కానీ, ఆ అంశాన్ని ఉపయోగించుకోవాలని తాము భావించడం లేదని ఓ భాజపా నాయకుడు చెప్పారు. రాష్ట్రంలో బలమైన హిందుత్వ వర్గం ఉంది. మొత్తం ఓటర్లలో వారు 8 నుంచి 10 శాతం ఉంటారు. హిందుత్వ పార్టీలైన భాజపా, శివసేన వేర్వేరుగా పోటీ చేస్తే, ఈ వర్గం ఓటర్లలో చీలిక వచ్చి ఉభయులూ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది చివరకు కాంగ్రెస్ ఎన్ సీపీలకే లబ్ధి చేకూరుస్తుంది. అందువల్ల మొదట కాంగ్రెస్ ఎన్ సీపీ కూటమిని చిత్తు చేసి, తరవాత శివసేన సంగతి చూస్తామని సదరు భాజపా నాయకుడు చెప్పుకొచ్చారు.

పనిచేయని విపక్ష ప్రచారం

ఎన్నికల ప్రచారంలో రైతుల దుస్థితి, నిరుద్యోగ సమస్య గురించి ప్రతిపక్షాలు లేవనెత్తినా, ఆ వర్గాల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. చెరకు రైతులకు బకాయిల చెల్లింపు, ప్రధానమంత్రి కిసాన్ యోజన వంటి సంక్షేమ పథకాల అమలు వల్ల రాష్ట్ర రైతాంగం భాజపా కూటమి ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం ప్రదర్శిస్తోంది. అనేకమంది చక్కెర మిల్లుల యజమానులు ఎన్​సీపీని వీడి భాజపా-శివసేన కూటమి వైపు మొగ్గారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో నిరుద్యోగ సమస్య అంత తీవ్రంగా కనిపించదు. జాతీయ సగటు నిరుద్యోగిత ఆరు శాతమైతే, రాష్ట్రంలో అయిదు శాతమే. రాష్ట్రం పారిశ్రామికంగా, వ్యాపారపరంగా ముందున్నందున నిరుద్యోగులకు ఏదో ఒక పని దొరుకుతోంది. కశ్మీర్​కు సంబంధించిన 370వ అధికరణను ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేయడం పట్ల అత్యధిక ఓటర్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 1993 ముంబయి పేలుళ్లు వారికి ఇంకా గుర్తున్నాయి. ఇందుకు బాధ్యులైన కొందరితో ఎన్​సీపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ సంబంధాల గురించి, పేలుళ్ల కారకులు దేశం విడిచి పరారు కావడానికి కారకులెవరనే దాని గురించి.. త్వరలోనే నిగ్గుదేలుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు. దర్యాప్తు సంస్థలు ఈ విషయంలో కీలక వివరాలను వెల్లడిస్తాయని ఆయన స్పష్టీకరించారు. పేలుళ్లకు బాధ్యుడైన దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఇక్బాల్ మిర్చి అతడి కుటుంబ సభ్యులతో ఎన్​సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్​కు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆరా తీయడానికి ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పటేల్ కు నోటీసులు జారీ చేసింది.

సరైన అభ్యర్థిని ప్రకటించటంలో..

రఫేల్ ఒప్పందంతో బడా పారిశ్రామిక సంస్థలకు ప్రధాని మోదీ భారీగా లబ్ధి చేకూర్చారని కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో రాహుల్ గాంధీ గత లోక్ సభ ఎన్నికల్లో విమర్శలు గుప్పించారు. దానివల్ల ఆయనకు కాని, ఆయన పార్టీకి కాని ఎన్నికల్లో ఒరిగిందేమీ లేదు. అయినా ప్రస్తుత ఎన్నికల్లోనూ రాహుల్ మళ్ళీ రఫేల్ మంత్రమే జపిస్తున్నారు. భాజపా ముఖ్యమంత్రి ఫడణవీస్​కు దీటుగా ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో కాంగ్రెస్ ఎన్​సీపీ కూటమి విఫలమైంది. అంతేకాక ఈ కూటమి నుంచి పలువురు ప్రముఖ నాయకులు భాజపా కూటమిలోకి ఫిరాయించారు. ఫలితంగా కాంగ్రెస్-ఎన్​సీపీ కూటమిలో నైతిక స్థైర్యం సన్నగిల్లింది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర మళ్ళీ భాజపా-శివసేన పరమైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు!

గత ఎన్నికల్లో..

2014 ఏప్రిల్-మే నెలల్లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోరాడిన శివసేన, అదే ఏడాది నవంబరు నాటి విధానసభ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఒంటరిగా పోటీ చేసింది. అప్పుడు దాని ఓట్ల శాతం 1.28 శాతం మేర తగ్గింది. తిరిగి 2019 లోక్ సభ ఎన్నికల్లో భాజపాతో చేతులు కలిపినప్పుడు శివసేన ఓట్ల శాతం 2.57 శాతం పెరిగింది. దీన్నిబట్టి రాష్ట్రంలోని హిందుత్వ ఓటును గుండుగుత్తగా రాబట్టుకోవాలంటే ఉమ్మడిగా పోటీ చేయడం అవసరమని గ్రహించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీ విడివిడిగా పోటీ చేశాయి. ఆ చతుర్ముఖ పోరులో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి.

కకావికలైన ప్రతిపక్షం

మహారాష్ట్ర బరిలో ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 31.2 శాతం మరాఠాలు, 12 శాతం దళితులు ఒకప్పుడు కాంగ్రెస్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్​సీపీ)లకు గట్టి మద్దతుదారులుగా ఉండేవారు. 2014 నవంబరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కూటమి మరాఠాలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేసింది. అయితే దాన్ని నెరవేర్చింది మాత్రం భాజపా-శివసేన కూటమి కావడం గమనార్హం. అప్పటి నుంచి కాంగ్రెస్-ఎన్​సీపీ మద్దతుదారులైన మరాఠాలు భాజపా వైపు మళ్లడం ప్రారంభించారు. కాంగ్రెస్ దళిత ఓటర్లలో చాలామంది భాజపా వైపు, ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ వైపు మళ్లారు. కాంగ్రెస్-ఎన్​సీపీలకు ఇప్పటికీ పట్టు ఉన్నది ముస్లిం ఓటర్లలోనే. రాష్ట్రంలో వీరు 11.5 శాతం వరకు ఉంటారని అంచనా. భాజపా కూటమికి ప్రధానంగా 28 శాతం ఓబీసీల్లో, 9.4 శాతం గిరిజనుల్లో, 5.5 శాతం అగ్రకులాల్లో సంప్రదాయంగా మద్దతు ఉంది.

ఇదీ చూడండి:రేపే మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details