ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై స్పందించారు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోడా. ట్యాంపర్ చేశారన్న వ్యాఖ్యలను అన్యాయం కంటే ఎక్కువ అనాల్సి వస్తుందని... నేరపూరిత ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని ఐఐఎం-కోల్కతా వేదికగా నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సు వేదికగా స్పష్టం చేశారు.
"సరిగా పని చేయకపోవడం వేరు. ట్యాంపరింగ్ వేరు. ఈవీఎంలను అనుకూలంగా మార్చలేం. మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే నేరపూరిత ఉద్దేశాలు ఉన్నాయని అర్థం. ఇది మమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. అత్యంత భద్రత నడుమ ఈవీఎంల తయారీ జరిగింది. పేరుపొందిన ప్రొఫెసర్లు, ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉన్న సంస్థల ఆధ్వర్యంలో ఓటింగ్ మెషీన్లను తయారుచేశారు."
-సునీల్ అరోడా, ప్రధాన ఎన్నిల అధికారి
ఓడిపోయిన అనంతరం విపక్షాలు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు అరోడా. విపక్షాల వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ను, తయారీదారులను తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు.
పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సహా విపక్షాల నేతలు ఈవీఎంలపై తరచూ ఆరోపణలు చేస్తున్నాయి.