పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడానికి మనం ఆ దేశ భూభాగంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు... పొరుగు దేశానికి ఏ మాత్రం అనుమానం రాకుండా మన గగనతలంలోనే ఉండి ముష్కర స్థావరాలపై పిడుగుల వర్షాన్ని మన వాయుసేన కురిపించగలదు. రఫేల్ యుద్ధ విమానాల రాకతో ఇలాంటి అసాధ్యాలు సుసాధ్యమయ్యాయి. చైనా సరిహద్దులకు చేరువలో ఉన్న లేహ్ వంటి పర్వత ప్రాంతం నుంచి కూడా ఈ జెట్ సునాయాసంగా గాల్లోకి లేస్తుంది.
రఫేల్ అంటే ఫ్రెంచ్ భాషలో "‘గాలి దుమారం’" అని అర్థం. పేరుకు తగ్గట్టే అది భారత ప్రత్యర్థుల పాలిట గాలి దుమారమే. ఇప్పటికే ఫ్రాన్స్, ఈజిప్ట్ వంటి దేశాల వద్ద రఫేల్ యుద్ధవిమానాలు ఉన్నాయి. అయితే భారత్‌కు అందినవి అత్యంత అధునాతనమైనవి. ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి మరిన్ని వ్యవస్థలను కొనుగోలు చేసి, వీటికి అమర్చడం వల్ల భారత రఫేల్ శత్రు భీకరంగా రూపొందింది.
సుదూర లక్ష్యాలపై దాడి
శత్రు భూభాగంలోకి ప్రవేశించకుండానే శత్రు భూభాగంలోని సుదూర ప్రాంతాల్లో దాడి చేయగల అస్త్రాలు రఫేల్ సొంతం. మెరుపువేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణుల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యర్థికి అవకాశమే ఉండదు. అత్యంత కచ్చితత్వంతో దాడి చేసే సామర్థ్యం వీటి సొంతం. రఫేల్‌తో పాటే ఇవి భారత్‌కు అందాయి.
గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించడానికి మీటియోర్ క్షిపణి. ఇది 150 కిలోమీటర్ల దూరంలోని శత్రు యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను నేలకూల్చగలదు. మన విమానం ఉనికి గురించి తెలియక ముందే శత్రు యుద్ధవిమాన కథ సమాప్తమవుతుంది. మీటియోర్‌లో 'రాకెట్ రామ్‌జెట్ మోటారు' ఉంది. ఫలితంగా ఈ క్షిపణి ఇంజిన్ సామర్థ్యం చాలా ఎక్కువ. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేస్తుంది.
- భూతల లక్ష్యాలను ధ్వంసం చేయడానికి స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణి. ఇది 300కుపైగా కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను నాశనం చేయగలదు.
- గాల్లో.. దగ్గర్లో ఉన్న శత్రు విమానాలను నేలకూల్చడానికి మైకా క్షిపణి. 80 కిలోమీటర్ల పరిధి దీనికి ఉంది. ఇది ‘సైలెంట్ కిల్లర్’గా పేరు పొందింది.‘
- స్పెక్ట్రా’ ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ. ఇది శత్రు రాడార్లను ఏమారుస్తుంది. గాల్లో రఫేల్ ఉనికిని దాచి పెడుతుంది. ఇందులో శక్తిమంతమైన జామర్లు, లేజర్ వార్నింగ్ రిసీవర్లు, 360 డిగ్రీల్లోనూ శత్రు క్షిపణుల రాకను పసిగట్టి, పైలట్‌ను హెచ్చరించే వ్యవస్థలు ఉన్నాయి. లక్ష్యాలపై దాడులు చేయడంలో పైలట్‌కు సాయం అందిస్తుంది. శత్రువుల రాడార్లు, క్షిపణులను బోల్తా కొట్టించే ఫ్లేర్ అండ్ షాఫ్ డిస్పెన్సర్లు, టోడ్ డెకాయ్ వ్యవస్థ వంటివి ఉన్నాయి. ఫలితంగా ఈ యుద్ధవిమానం.. ప్రత్యర్థిపై దాడి చేసి, అజేయంగా స్వదేశానికి తిరిగి రాగలదు.
- ఆర్‌బీఈ-2ఎఎ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే మల్టీ మోడ్ రాడార్(ఏఈఎస్‌ఏ). ఇది 124 మైళ్ల దూరంలోని వందకుపైగా లక్ష్యాలపై కన్నేసి ఉంచగలదు. ఏకకాలంలో 8 లక్ష్యాలపైకి గురిపెట్టగలదు. గగనతలంలో ముప్పులను పసిగట్టి, వాటిని నిర్దిష్టంగా వర్గీకరించి, ఆ వివరాలను పైలట్‌కు అందిస్తుంది.
- రఫేల్ కాక్‌పిట్ అత్యంత అధునాతనంగా ఉంటుంది. హోలోగ్రఫిక్ కాక్‌పిట్ డిస్ప్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫలితంగా యుద్ధవిమాన నియంత్రణ, మిషన్ డేటా నిర్వహణ, ఆయుధ ప్రయోగం చాలా సులువు.
- పైలట్ తన తలను కిందకు దించాల్సిన అవసరం లేకుండానే కీలక సమాచారాన్ని అందించే హెడ్ అప్ డిస్ప్లే వ్యవస్థ ఉంది.
- శత్రువుల రాడార్ తరంగాలను పరావర్తనం చెందించకుండా.. తనలోనే శోషించుకునే అధునాతన పూతను ఈ విమానానికి వాడారు.
- శక్తిమంతమైన తూటాలను ప్రయోగించే 30 ఎంఎం క్యానన్ గన్ ఉంది.
- గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం ఉంది. అవసరమైతే సహచర యుద్ధవిమానాలకూ ఇంధనాన్ని నింపగలదు.