కరోనా వైరస్ సంక్షోభంతో సతమతమవుతున్న రాష్ట్రాలకు మిడతల దాడి తలనొప్పిగా మారింది. పంటలపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని మిగులుస్తోన్న మిడతలను అడ్డుకోవటం వారి ముందున్న అతిపెద్ద సవాలు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో మిడతల ప్రభావం తీవ్రంగా ఉంది. మిడతల కారణంగా అక్కడి రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే మిడతలను అరికట్టేందుకు రాజస్థాన్ ప్రభుత్వం డ్రోన్లు, ట్రాక్టర్ల ద్వారా క్రిమిసంహారకాలను పిచికారి చేయటం వంటి అన్ని రకాల నియంత్రణ చర్యలు చేపడుతోంది.
రాజస్థాన్‌లో జిల్లాల వారీగా నష్టం..
రాజస్థాన్‌లో మిడతల దాడి బీభత్సం 14 జిల్లాలకు వ్యాపించింది. ఆయా జిల్లాల్లో పత్తి, కూరగాయల పంటల దిగుబడి భారీగా తగ్గిపోయింది. నాగౌర్ జిల్లాలోని ఖాన్పుర్ మిజ్రా గ్రామంలో ఓ రైతు పొలంలోని 8-12 అంగుళాల పత్తి మొక్కలను పూర్తిగా తినేశాయంటే వాటి ప్రభావ ఏవిధంగా ఉందో అర్థమవుతుంది.
బికనేర్ | 1345 |
చురూ | 500 |
జోధ్‌పుర్ | 455 |
జైపూర్ | 397 |
శ్రీగంగానగర్ | 200 |
బర్మేర్ | 170 |
దౌసా | 55 |
నాగౌర్ | 25 |
శికర్ | 20 |
బరన్ | 3 |
మిడతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఎడారి మిడతలు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 మిలియన్ చదరపు కిలోమీటర్లపై ప్రభావం చూపుతున్నాయి. వాయవ్య, తూర్పు ఆఫ్రికా, అరబ్ దేశాలు, అరేబియా ద్వీపకల్పం, దక్షిణ సోవియట్ రష్యా, ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, భారత్ వంటి దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. సాధారణ రోజుల్లో వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అవి 30 దేశాల్లో దాదాపు 1.6 కోట్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో కనిపిస్తున్నాయి.
2019, మే 16 తర్వాత రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈ ఎడారి మిడతలు పంటలను ధ్వంసం చేయడం గుర్తించారు అధికారులు. భారత ప్రభుత్వ మిడతల నియంత్రణ, పరిశోధన విభాగం 2019 మేలో 246 ప్రాంతాల్లో సర్వే చేసింది. 46 ప్రాంతాల్లో ఈ మిడతలు ఉన్నట్లు గుర్తించారు.
శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారు?
'కెన్యా, సొమాలియా, ఇథియోపియా, దక్షిణ ఇరాన్, పాకిస్థాన్‌లో కొంత భాగంలో ఎడారులు ఉన్నందున ఈ మిడతల ప్రభావం అధికంగా ఉంటుంది. ఎడారుల్లో వర్షాలు పడిన సమయంలో నీటి కుంటలు ఏర్పడి మిడతల సంతతిని పెంచుకునేందుకు వాతావరణం అనువుగా మారుతుంది. ఈ సందర్భాల్లో సాధారణ పరిస్థితుల్లో కంటే 400 రెట్లు అధికంగా గుడ్లు పెడతాయి. ఇలాంటి వాతావరణ మార్పులు ఎక్కువగా ఉండే దేశాల్లో భారత్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మిడతలు మూడుసార్లు, ఒక్కోసారి 80 గుడ్లు వరకు పెడతాయి.' అని జైపుర్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని శాస్త్రవేత్త అర్జున్ సింగ్ తెలిపారు.