తెలంగాణ

telangana

పార్లమెంటు భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు

By

Published : Nov 21, 2020, 6:53 AM IST

పార్లమెంటు నూతన భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు.. టెండర్‌ చేజిక్కించుకున్న టాటా సంస్థ రాత్రింబవళ్లు పని చేస్తోంది. డిసెంబరు రెండో వారంలో, కార్తీక మాసం ముగిసేలోగా ఈ శంకుస్థాపన జరగనున్నట్లు తెలుస్తోంది.

all works are completed to start parliament new building construction
పార్లమెంటు భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు

పార్లమెంటు కొత్త భవన శంకుస్థాపనకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుత భవనం చాలదన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల్లో భారీ రాజసౌధాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్‌, ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ దీని ఆకృతులు రూపొందిస్తుండగా, టాటా సంస్థ నిర్మాణ పనులు చేపడుతోంది. డిసెంబరు రెండో వారంలో, కార్తీక మాసం ముగిసేలోగా శంకుస్థాపన జరగొచ్చని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

2022 అక్టోబర్​ నాటికి..

టాటా సంస్థ ఇప్పటికే రాత్రింబవళ్లు పనిచేస్తూ ఇప్పుడున్న భవనం ప్రహరీ చుట్టూ బ్యారికేడ్లను నిర్మిస్తోంది. భద్రతతోపాటు, దుమ్మూధూళి బయటికి వెదజల్లకుండా ఏర్పాట్లు చేస్తోంది. నిర్మాణ స్థలంలో ప్రస్తుతం ఉన్న భారీ వృక్షాలను కూడా జాగ్రత్తగా పెకలించి వేరేచోట నాటడానికి తరలిస్తోంది. పనులను 2022 అక్టోబర్‌ నాటికి పూర్తిచేయాలన్నది లక్ష్యం.

రూ.861.9 కోట్లతో..

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం కంటే 17వేల చదరపు మీటర్ల అదనపు విస్తీర్ణం కొత్త భవనంలో అందుబాటులోకి వస్తుంది. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చొనేందుకు వీలుగా కొత్త సభలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనానికి అభిముఖంగా తలపెట్టిన నూతన భవన నిర్మాణం కోసం కేంద్రం రూ.861.9 కోట్లు ఖర్చుపెట్టనుంది. ఈ కాంట్రాక్ట్‌ కోసం జరిగిన పోటీలో ఎల్‌ అండ్‌ టీ కంటే రూ.3.1 కోట్ల తక్కువకు టెండర్‌ కోట్‌ చేసి టాటా సంస్థ పనులను దక్కించుకొంది.

త్రికోణాకారంలో..

పాత భవనం గుండ్రంగా ఉండగా, కొత్త భవనం త్రికోణాకారంలో వస్తుంది. కొత్త సభల్లో సీట్ల ఏర్పాటు దాదాపు పాత భవనంలో మాదిరే గుర్రపు నాడా ఆకారంలో ఉంటాయని సమాచారం. ప్రస్తుతం తొలి వరుసలో ఉన్నవారికే పరిమితమైన డెస్క్‌లు ఇప్పుడు ప్రతి సభ్యుడికీ అందుబాటులోకి తెస్తున్నారు. దిగువ భాగంలో ప్రధాని, ఉభయ సభాపతులు, మంత్రుల కార్యాలయాలు ఉంటాయి. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభమైన తర్వాతకూడా పాత పార్లమెంటు భవనాన్ని ఉపయోగించుకుంటారు.

1,100 కార్లను పార్కింగ్‌ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. పార్లమెంటు ఉభయసభలు జరిగినప్పుడు లోక్‌సభలోనే 1,272 మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని సమాచారం. ఇంతవరకూ తేదీలు ఖరారు కాలేదు.

ఇదీ చూడండి:జీ-20 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details