తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సచివాలయానికి సొబగులు.. ఉద్యోగులంతా ఒకేచోట! - 2024లో సెంట్రల్​ విస్టా అభివృద్ధి లక్ష్యం..

కేంద్ర సచివాలయ ఉద్యోగులను ఒకే చోటకు చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణానికి బీజం వేసింది. ఈ ప్రణాళికతో దాదాపు 70 వేల మంది ఒకే చోట పని చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌కు నైరుతి వైపు ప్రధానమంత్రి కార్యాలయం, ఉత్తరం వైపు ఉపరాష్ట్రపతి నివాసం ఏర్పాటు చేస్తున్నారు.

all-the-offices-are-centralized
కార్యాలయాలన్నీ కేంద్రీకృతం.. మ్యూజియంలుగా నార్త్​, సౌత్​ బ్లాక్​లు

By

Published : Jan 17, 2020, 6:45 AM IST

Updated : Jan 17, 2020, 7:38 AM IST

ప్రస్తుతం దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కేంద్ర సచివాలయ ఉద్యోగులను ఒకే చోటకు చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణానికి బీజం వేసింది. ప్రస్తుతం దాదాపు 25 వేల నుంచి 32 వేల మంది ఉద్యోగులు కొత్త దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల్లో పనిచేస్తున్నారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన పార్లమెంటు భవనం, సెంట్రల్‌ విస్టా ప్రణాళికలో భాగంగా దాదాపు 70 వేల మంది ఒకే చోట పనిచేసే సౌకర్యాలు కలగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియాగేట్‌ వరకు ఉన్న సెంట్రల్‌ విస్టా ఉత్తర, దక్షిణ దిక్కుల్లో మూడు కిలోమీటర్ల మేర ఒక్కోటి ఎనిమిది అంతస్తులుగల ఎనిమిది భారీ భవంతులు నిర్మించాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నిర్ణయించింది.

ఈ భవనాలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలకు ఏటా రూ.వెయ్యి కోట్ల మేర చెల్లిస్తున్న అద్దె భారం తగ్గుతుంది. ప్రస్తుతం 51 శాఖల్లో 22 మాత్రమే సెంట్రల్‌ విస్టా పరిధిలో ఉన్నాయి. కొత్త భవనాల నిర్మాణం తర్వాత మిగిలినవాటినీ అందులోకి తీసుకొస్తారు.

ప్రధాని కార్యాలయం ఇలా.. ఉపరాష్ట్రపతిది అలా...

కొత్త ప్రణాళికలో భాగంగా రాష్ట్రపతి భవన్‌కు నైరుతి వైపు ప్రధానమంత్రి కార్యాలయం నిర్మిస్తారు. ప్రధానమంత్రి నివాసం కూడా దాని పక్కనే ఉంటుంది. ఉత్తరం వైపు ఉపరాష్ట్రపతి నివాసం ఏర్పాటు చేస్తారు. ఇప్పుడున్న పార్లమెంటు భవనానికి ఆనుకొని త్రికోణాకారంలో వెయ్యి మంది సభ్యులు కూర్చొనే విధంగా పార్లమెంటు నూతన భవనం నిర్మిస్తారు.

ప్రస్తుతం ప్రధానమంత్రి, రక్షణ, ఆర్థిక, హోంశాఖ కార్యాలయాలున్న నార్త్‌ బ్లాక్‌, సౌత్‌ బ్లాక్‌ భవనాలు మ్యూజియంలుగా రూపాంతరం చెందుతాయి. జన్‌పథ్‌లో సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ను అక్కడికి సమీపంలోని జామ్‌నగర్‌ హౌస్‌కు తరలిస్తారు. కొత్త పార్లమెంటు భవనాన్ని దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే 2022 ఆగస్టు 15నాటికల్లా అందుబాటులోకి తెస్తారు.

2024లో సెంట్రల్​ విస్టా అభివృద్ధి లక్ష్యం..

పార్లమెంటులో ప్రతి ఇద్దరు సభ్యులకు ఒక బెంచ్‌ ఉండేలా సీటింగ్‌ ఏర్పాటు చేస్తారు. దాదాపు 1200 మంది ఎంపీలు కూర్చొనే విధంగా సెంట్రల్‌ హాల్‌ నిర్మిస్తారు. ఎంపీలందరికీ ఒక్కో కార్యాలయాన్ని కేటాయిస్తారు. సెంట్రల్‌ విస్టా, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని 2024కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెంట్రల్‌ విస్టా అభివృద్ధిలో భాగంగా యమునా నదీ తీరంలో న్యూ ఇండియన్‌ గార్డెన్‌ను అభివృద్ధి చేస్తారు.

ఇదీ చూడండి: ప్రైవేటు రంగం చేతుల్లోకి తేజస్​ రైలు

Last Updated : Jan 17, 2020, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details